దూరమైన మాతృత్వం | Sakshi
Sakshi News home page

దూరమైన మాతృత్వం

Published Wed, Sep 7 2016 9:59 PM

రోదిస్తున్న పసికందు

  • పాలిస్తూ మృత్యు ఒడికి చేరిన తల్లి
  • గుక్కపట్టి ఏడుస్తోన్న పసికందు
  • తొగుట: నిండు బాలింత.. నెలలు నిండని పసికందు.. విధి వక్రీకరించింది. వీరి బంధాన్ని వేరు చేసింది. తల్లి పాలే ఆ పసికందుకు దూరమయ్యాయి. పుట్టిన బిడ్డకు పాలిస్తూ ఆ తల్లి మృత్యు ఒడిలోకి ఒరిగిపోయింది. పాలను తాగుతున్న లోకం తెలియని ఆ పసికందుకు ఇక అమ్మలేదన్న విషయం తెలియదు. ఆ పసికందును చూసిన కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదించారు. పలువురిని కంట తడి పెట్టించిన ఈ విషాదకర సంఘటన తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది.

    కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తుక్కాపూర్‌ గ్రామ శివారులోని తుర్రకాశవాడకు చెందిన షేక్‌ సమీనా (20) మూడు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తల్లిగారింటి వద్దే ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటి పనులు పూర్తి చేసుకుని తన మూడు నెలల కూతురుకు పాలిస్తూ పడుకుంది. ఈ క్రమంలో ఆమె అలాగే మృత్యు ఒడిలోకి చేరిం‍ది. సాయంత్రం పసిపాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తుండడంతో పక్కింటివారు వచ్చి చూశారు.

    వారు సమీనాను నిద్రలేపే ప్రయత్నం చేయగా, ఆమె నిద్రలేవ లేదు. దీంతో సమీపంలో ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన డాక్టర్‌ సమీనాఅప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. అక్కడ ఉన్న పసికందును చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
Advertisement