కిరాతకులు అమ్మను చంపేశారు..! | Sakshi
Sakshi News home page

కిరాతకులు అమ్మను చంపేశారు..!

Published Thu, Jul 28 2016 10:21 PM

కిరాతకులు అమ్మను చంపేశారు..!

– కొట్టి.. పురుగులమందు తాపి..
– అతిగా మద్యం సేవించొద్దన్నందుకే కుమారుల ఘాతుకం
– నార్కట్‌పల్లి మండలంలో దారుణం
– పోలీసుల అదుపులో నిందితులు..?

నవమాసాలు మోసి.. పురిటినొప్పులను పంటి బిగువన అదిమి జన్మనిచ్చిందనే విషయాన్నే మరచిపోయారు.. లాలిపాటలు.. గోరుముద్దలు గుర్తుకే రాలేదు.. విద్యాబుద్ధులు చెప్పించి పెంచి పెద్దచేసిందనే కనికరం కూడా చూపలేదు.. అతిగా మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించిన ఆ మాతృమూర్తిని పొట్టనబెట్టుకున్నారు.. ఇద్దరు కిరాతక కుమారులు.  ఈ దారుణ ఘటన గురువారం నార్కట్‌పల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
– నార్కట్‌పల్లి
 నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లి గ్రామపంచాయతీ పరిధి గద్దగోటిబావి గ్రామానికి చెందిన బోగిని సైదులు, పిచ్చమ్మ(48) దంపతులకు వెంకన్న,నరేష్‌ కుమారులు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న చిన్నకర్మకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు.
ఆరోగ్యాన్ని పాడు చేసుకోద్దనందుకు..
బంధువుల ఇంట్లో కార్యక్రమం జరుగుతుండగానే కుమారులిద్దరు పక్కనే మద్యం సేవిస్తున్నారని పిచ్చమ్మకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి అతిగా తాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని పెద్ద కుమారుడు వెంకన్నకు సూచించింది. దీంతో వెంకన్న ఆగ్రహావేశానికి లోనై తల్లిని అక్కడే కొడుతుండగా చిన్న కుమారుడు నరేష్‌ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి పరువు తీస్తావా అంటూ ఆ మాతృమూర్తిని కొట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు.
బలవంతంగా పురుగుల మందు తాపి..
కుమారులు కొడుతుండడంతో లబోదిబోమంటూ పిచ్చమ్మ ఇంట్లో నుంచి బయటికి పరుగుతీయడంతో ఆమెను ఈడ్చుకుంటూ మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనను చూసిన వారి ఇద్దరి భార్యలు అడ్డురావడంతో వారిని కూడా చితకబాదారు. ఆపై వ్యవసాయ సాగు కోసం తెచ్చిన పురుగులమందును పిచ్చమ్మకు బలవంతంగా తాపించి గదిలో పడవేసి గడియపెట్టి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయారు. కాసేపటికి ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడడంతో అప్పటికే పిచ్చమ్మ మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మోతీరామ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, వ్యవసాయ బావి వద్ద ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.


 

Advertisement
Advertisement