జాదూగాడురా.. | Sakshi
Sakshi News home page

జాదూగాడురా..

Published Mon, Nov 21 2016 10:41 PM

జాదూగాడురా..

పెళ్లిళ్లు చేయిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన యువకుడు అరెస్టు 
యువతను మోసగిస్తున్న ఎంటెక్‌ పట్టభద్రుడు
వివాహాలు చేయిస్తానని రూ.లక్షల్లో వసూలు
నిందితుడి అరెస్టు, రూ.12 లక్షల సొత్తు స్వాధీనం
కాకినాడ క్రైం : అతను ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేశాడు. పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ యువత ఆదాయం సంపాదించుకోవచ్చంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసగించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. 
మోసగించే విధానం ఇదీ..
తొండంగి మండలం, వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు (24) అలియాస్‌ (ఈశ్వర్, రామిరెడ్డి) హైదరాబాద్‌లో ఎంటెక్‌ చేశాడు. సులువుగా అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు పెళ్లికాని ఆశావహులు, యువతను ఎంచుకున్నాడు. వివాహ పరిణయ వేదిక మ్యారేజ్‌ బ్యూరోను 2014లో ఈశ్వర్‌ పి. వెంకటరామిరెడ్డి అనే పేరుతో ప్రారంభించాడు. భర్తలేని భార్యకు రెండో పెళ్లి అని... పీటలమీద పెళ్లి ఆగిపోయిందని ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తామని... కులమతాలతో ప్రసక్తి లేదంటూ ఇలా రకరకాల ఆకర్షణీయమైన  ప్రకటనలు ఇచ్చి, అందమైన యువతుల ఫొటోలను చూపించి యువకులను ఆకర్షించేవాడు. శ్రీనివాసరావు మాయలో పడిన యువకుల నుంచి ప్రాసెసింగ్‌ ఖర్చుల కోసమంటూ రూ.10 వేల వరకూ వసూలు చేసేవాడు. టెలికాలర్‌ ఉద్యోగం పేరిట నెలకు రూ.12 వేల వరకూ ఆదాయం గడించవచ్చంటూ ప్రకటన లిచ్చి నిరుద్యోగ యువత నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. బాధితుల నుంచి ఆధార్‌, ఏటీఎం కార్డులతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ప్రూఫ్స్‌తో వారి పేరుతో íసిమ్‌ కార్డులు తీసుకునేవాడు. వివాహాల కోసం, టెలికాలర్‌ ఉద్యోగం కోసం కట్టిన డబ్బులను తన ఖాతాలో డిపాజిట్‌ చేసుకోకుండా తన సంస్థలో టెలి కాలర్‌ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఖాతాల్లో వారికి తెలియకుండా డిపాజిట్‌ చేయించేవాడు. ఏటీఎం కార్డులతో వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసేవాడు. ఒక్కో యువకుడితో ఒక నకిలీ సిమ్‌ కార్డుతో సంభాషణ సాగించి, పనిపూర్తయ్యాక ఆ సిమ్‌ తొలగించేవాడు. ఇలా ఇతను గుంటూరు నుంచి కృష్ణా, విజయవాడ, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తమిళనాడులోని కొంతమంది బాధితులను మోసగించినట్టు పోలీసుల తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో అన్వేషించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సీసీ పుటేజీ వివరాలు, డబ్బు చెల్లించిన ఖాతాలను పరిశీలించగా పోలీసులు ఆధారాలు దొరికాయి. ఎట్టకేలకు కాకినాడ జగన్నాథపురం ఆంధ్రా బ్యాంకులో ఓ మహిళ ఖాతాకు రూ.4.50 లక్షల డిపాజిట్‌ అయినట్టు గుర్తించి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుడ్ని అతడి స్వగ్రామం వేమవరంలో పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి ఎస్టీమ్‌ కారు, స్కూటర్, 9 బంగారు ఉంగరాలు, 2 బంగారు చైన్లు, 50 నకిలీ సిమ్‌కార్డులు, 10 సెల్‌ఫోన్లు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వంశీధర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement