'మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి' | Sakshi
Sakshi News home page

'మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి'

Published Thu, May 5 2016 8:59 PM

'మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి' - Sakshi

కిర్లంపూడి (తూర్పుగోదావరి) : ఎన్నికల సమయంలో కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల సాధనకు అవసరమైతే  మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కాపు నాయకులు ఓంకారం వెంకటరమణతోపాటు పలు జిల్లాల కాపు నాయకులు ముద్రగడను తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో గురువారం కలిశారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేసి నిరుపేద కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమించామన్నారు.

 

తాను అంతకుముందు చేసిన ఉద్యమం  తరువాతే బీసీ కమిషన్ వేయడంతోపాటు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల కేటాయింపు వంటివి జరిగాయన్నారు. అప్పటివరకూ కాపులకు ఇచ్చిన ఎన్నికల హామీలు చంద్రబాబుకు గుర్తు రాలేదన్నారు. తుని కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి అమాయకులను వేధించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా నిరుపేద కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని ముద్రగడ పిలుపునిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement