Sakshi News home page

రామ..రామ

Published Sat, Mar 19 2016 2:55 AM

muhurtham changed in badrachalam temple presenting Gold armor

‘సువర్ణ భద్ర కవచం’ ముహూర్తం మారింది
రాములోరి క్షేత్రంలో ‘ఆగమా’గం

 భద్రాచలం :   భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో భక్తరామదాసు కాలం నాటి ఉత్సవమూర్తులకు సువర్ణభద్రకవచం తొడిగే ముహూర్తం మారింది. శుక్రవారం ఉదయం 9.27 గంటలకు ఉత్సవ మూర్తులకు ప్రతిష్టాత్మకంగా సువర్ణ భద్రకవచ సమర్పణం గావించి, సాయంత్రం వేళ సార్వభౌమ సేవ జరిపించాలని ముందుగా నిర్ణయించినా బంగారు కవచం తయారీ పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో దీనిని శనివారం  నాటికి మార్చారు. రాములోరి పంచలోహ విగ్రహాలను అమ్మకానికి పెట్టి అబాసుపాలైన భద్రాద్రి ఆలయాధికారులకు తాజా పరిణామాలు మరింత అపఖ్యాతిని మూటగట్టాయి. స్వామివారి పురాతన విగ్రహాలకు ప్రతి వందేళ్లకోమారు బంగారు కవచం తొడగటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్సవాలపై దేవస్థానం అధికారులు మొదటి నుంచి నిర్లక్ష్య దోరణితోనే వ్యవహరించారనడానికి తాజా పరిణామాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్వామివారి మూర్తులపై ఇదివరకే ఉన్న బంగారు పూతను తీయగా 3.457 కేజీల బంగారం వచ్చిందని శుక్రవారం దేవస్థానం అధికారులు  ప్రకటించారు. కొత్తగా బంగారు కవచం వేసేందుకు పాత బంగారంతో పాటు తాజాగా దేవస్థానం ద్వారా 896.550 గ్రాము ల బంగారం కొనుగోలు చేశామన్నారు. భక్తులు విరాళంగా ఇచ్చిన 494.200 గ్రాముల బంగారం, నగదుతో కొన్న 87.250 గ్రాములను  కలిపి మొత్తంగా 4.894 కేజీల బంగారంతో స్వామివారికి సువర్ణ భద్రకవచం వేయిస్తున్నట్లుగా ఈఓ జ్యోతి వెల్లడించారు.

వందేళ్ల తరువాత  చేపట్టే ఈ పనులపై ముందుగానే ఇక్కడి అధికారులు  దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోరారు. ఈ క్రమంలోనే వైదిక కమిటీ సూచనలతో శ్రీరామాయణ మహాక్రతువు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ ప్రకారం ఉత్సవ మూర్తులకు శుక్రవారం సువర్ణ కవచం సమర్పణ చేయాలని నిర్ణయించారు. శాస్త్రోక్తంగా నిర్వహించతలపెట్టిన ఈ వేడుకకు ముహూర్తం మారిపోవటానికి దేవస్థానం అధికారులు చెబుతున్న సాంకేతిక కారణాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 బంగారు కవచం తయారీలోనే నిర్లక్ష్యమా?
స్వామివారి బంగారు కవచం తయారీ బాధ్యతలను కమిషనర్ అనుమతితో ఓ సంస్థకు అప్పగించినట్లుగా ఇక్కడి అధికారులు చెబుతున్నారు. బంగారు కవచంను తయారీదారులు అనుకున్న సమయానికి ఇవ్వకపోవటంతోనే వేడుక శనివారం నాటికి వాయిదా వేయాల్సి వచ్చిదని ఈఓ జ్యోతి వెల్లడించారు. ముహూర్తం వేళకు వీటిని అప్పగించకపోవటంలో నిర్లక్ష్యం ఎవరిదనేది వెల్లడి కావాల్సి ఉంది. బంగారు తొడుగు విషయంలో భద్రాద్రి దేవస్థానం అధికారులు మొదటి నుంచీ గోప్యత వహిస్తున్నారు. ఇక్కడి అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘భద్రాద్రి దేవస్థానంలో ఏం జరుగుతుంద’నే దానిపై స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. దేవాదాయశాఖ అధికారులు తగిన రీతిలో స్పందించకపోవటం వల్లే ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని మార్చాల్సివచ్చిందనే అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది.

 విరాళాల సేకరణకు అనుమతి ఉందా?
దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భద్రాద్రి ఆలయంలో చేపట్టే ఎటువంటి పనులకైనా ఆ శాఖ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి ఉండాలి. స్వామివారి ఉత్సవ మూర్తులకు కొత్తగా బంగారు కవచం చేయించేందుకు విగ్రహాలపై తొలగించిన పాత బంగారం సరిపోలేదని భక్తుల నుంచి బంగారు, ధన రూపేణ విరాళాలను సేకరించినట్లుగా ఈఓ జ్యోతి వెల్లడించారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన స్వామివారి మూర్తులకు సువర్ణ కవచం వేసే బంగారంలో తమ భాగస్వామ్యం ఉంటే చాలనుకునే వారు అనేక మంది ఉన్నారు. దేవస్థానం అధికారులు దీనిపై ప్రచారం చేస్తే భక్తుల నుంచి బంగారం, ధన రూపేణ పెద్ద మొత్తంలో సమకూరేది. అలా కాకుండా కొంతమంది దగ్గర నుంచే బంగారం, డబ్బులు పోగు చేయటంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మహాకార్యంలో భాగస్వామ్యులను కానివ్వకుండా దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్న నేపథ్యంలో దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.

Advertisement
Advertisement