Sakshi News home page

శ్వాస.. ధ్యాస.. యాస.. గోదారే..

Published Tue, Jun 28 2016 9:19 AM

శ్వాస.. ధ్యాస.. యాస.. గోదారే..

ఇదే ముళ్లపూడి వెంకటరమణ జీవిత రహస్యం
 సాహిత్యం, సినిమాలకు కేంద్రబిందువిదే

 
 ‘‘మా ఊరు ధవళేశ్వరం. గోదావరి ఒడ్డున రాంపాదాలరేవు. ఆ వీధిలో మొట్టమొదటి మేడ మా ఇల్లు. ఆనకట్ట పంతులుగారి మేడ మా ఇల్లు. పెద్దఅరుగులు, స్తంభాలు, మెట్లు, గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు చావిట్లో జై కుసుమకుమారి భజనలు, నట్టింట్లో దెయ్యాలను సీసాలలో బిగించే ముగ్గు పూజలు, బైరాగులూ- పెరటివసారాలో చుట్టాలు, వాళ్ల చుట్టాలకు పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ.. రాజమండ్రి నుంచి గుమ్మిడిదల దుర్గాబాయమ్మగారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్లకీ ‘మై తో హూం తూ తో హై’ అంటూ చెప్పే హిందీ పాఠాలు, పూనకాలు, శాంతులు, తర్పణాలూ.. ఒకసారి మానాన్న గారు ఆస్పత్రికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్లిపోయారు. ఇక రారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్లిపోయింది.’’
 
 ‘‘ నేను మెడ్రాసులో ఫస్టు ఫారం పాసయ్యాక.. రాజమండ్రి వీరేశలింగం స్కూల్లో సెకండు, ధర్డుఫారాలు చదివాను. అప్పుడు స్కూలుకి నెలజీతం మూడు రూపాయలు. అది కట్టడానికి కొన్నాళ్లు శ్రీముడుంబై నరసింహాచార్యులు అనే జమీందారు సాయంచేశారు. కొన్నాళ్ల తరువాత ఆయన ఊరెళ్లిపోయారు. అప్పుడు ఆ మూడు రూపాయల కోసం, నన్ను ధవళేశ్వరం రమ్మన్నారు. మా నాన్నగారి నేస్తం అన్నంభట్ల సుబ్బయ్యగారు. ఆయన ఆనకట్టాఫీసులో పెద్ద గుమస్తా. ఒకటోతారీఖున-అంటే జీతాలు ఇచ్చే రోజున ఆయన ఒకప్యూన్‌ని తోడిచ్చి ఆఫీసులో అందరు ఉద్యోగుల దగ్గరకు పంపేవారు.‘ఇలా ఫలానా క్యాషు కీపరు పంతులు గారబ్బాయి రాజమండ్రిలో సెకండు ఫారం చదువుతున్నాడు. మూడు రూపాయల జీతం కట్టాలి-మీకు తోచింది ఇవ్వండి’ అని చెప్పేవారు. మూడు రూపాయలు పూర్తి కాగానే రాజమండ్రికి నడిచివెళ్లే వాడిని, అప్పుడప్పుడు జట్కాల వెంట పరిగెత్తేవాడిని, కంకరరాళ్లు. అప్పటికింకా తారురోడ్డు పొయ్యలేదు. ఇంటికెళ్లి నేను కూడా-గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఏడిచేవాడిని. మా అమ్మమ్మ కాళ్లకి మంచి నూనె రాసి మెల్లగా తోమేది. నిద్రపోయి ఎప్పుడో లేస్తే, మజ్జిగన్నం పెట్టేది.’’
 
 ఇవే కాదు ఇలా ఎన్నో విషయాలు, విశేషాలను అనుభవాలను సినీరచయిత, నిర్మాత, బాపు ఆత్మీయ స్నేహితుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన స్వీయ చరిత్ర ‘కోతికొమ్మచ్చి’లో పదిలపరిచారు. గోదావరితో తనకున్న అనుబంధాన్ని.. గోదావరిపై ఉన్న మక్కువను తెలియపరిచారు. అందుకే ఆయన కలం నుంచి జాలువారిన ‘రెండు జెళ్ల సీతలు, బుడుగులు, సీగాన పెసూనాంబలు, అప్పారావులు, లావుపాటి పక్కింటి పిన్నిగారి ‘ముగుళ్లూ’.. ఇలా అందరిదీ గోదావరి మాండలికమే. ఇక ఆయన సినిమాల్లోని ‘ఆమ్యామ్యా’ రామలింగయ్యలు, ‘తీ.తా’లు(తీసేసిన తాసీల్దార్లు), కనెక్షన్ కన్నప్పలు, గోదావరి చుట్టూ ఆడుకున్నవారే. సినీ రచయితగా, నిర్మాతగా ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ముళ్లపూడి ‘గోదావరి మా ఫిలిం స్టూడియో’ అంటూ తరచూ బాపుతో అనేవారంటే.. గోదావరి అంటే ఆయనకు ఎంత భక్తో, ప్రేమో, ఇష్టమో చెప్పొచ్చు.
 - సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్, నేడు హాస్య బ్రహ్మ ముళ్లపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా...
 
 గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ
రమణగారు సొంత సినిమా తీస్తున్నప్పుడు రాసుకోవడానికి సాధారణంగా రాజమండ్రి లాంచీ మాట్లాడుకుని భద్రాచలం వరకు వెళ్లేవారు. ఆయనకు గోదావరి అంటే ప్రాణం, భక్తి, ప్రేమ కూడా. భద్రాచలంలో దైవదర్శనం చేసుకుని వచ్చేవారు. ఒక్కరూ ఎప్పుడూ వెళ్లరు. బాపుగారు, శ్రీరమణగారు, ఎమ్వీఎల్, సీతారాముడు, కె.వి. రావు ఎంతమందివీలైతే అంత మంది వెళ్లేవారు. వారం రోజులు లాంచి ప్రయాణానికి కావలసిన వంట సామాన్లు, కూరలు వగైరాలు, మందీమార్బలంతో వెళ్లేవారు.
 - ముళ్లపూడి శ్రీదేవి,(అర్ధాంగి)

Advertisement

తప్పక చదవండి

Advertisement