మీ దయ రాదా.. | Sakshi
Sakshi News home page

మీ దయ రాదా..

Published Mon, Mar 20 2017 12:13 AM

muncipal employees problems

  • ఇంక్రిమెంట్లకు నోచని మున్సిపల్‌ ఔట్‌సోరి్సంగ్‌ సిబ్బంది
  • జీతాలు పెంచుతూ గత ఏడాది ఆగస్టులోనే జీఓ
  • ఉత్తర్వులు జారీ చేయని సీడీఎంఏ
  • అప్పులపాలవుతున్నామంటూ ఉద్యోగుల ఆవేదన
  •  
    సాక్షి, రాజమహేంద్రవరం : 
    దేవుడు వరమిచ్చినా దానిని అందుకోవడంలో మున్సిపల్‌ విభాగంలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు. వారి జీతాలు పెంచుతూ గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జీఓ జారీ అయినా ఇప్పటివరకూ అది అమలుకు నోచుకోలేదు. దీంతో వారు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పెంచిన జీతాలు
    ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేస్తే ఉన్న ఉద్యోగానికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో 2003లో అప్పటి ప్రభుత్వం సిబ్బందిని నియమించింది. చాలీచాలని జీతాలతో ఇప్పటికీ వారు విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణ ఉద్యోగుల మాదిరిగా ప్రతి ఐదేళ్లకూ వేతన సవరణ విధానం వీరికి వర్తించదు. ప్రభుత్వం దయతలిస్తే తప్ప జీతభత్యాలు పెరగని దయనీయత. అలాంటిది గత ఏడాది ఎన్నో వినతుల అనంతరం వివిధ విభాగాల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెంచుతూ జీఓ 151ని ప్రభుత్వం జారీ చేసింది. పెంచిన జీతాలను అదే ఏడాది సెప్టెంబర్‌ 1న ఇవ్వాలని ఆదేశించింది. ఆ మేరకు ఇతర శాఖలు ప్రభుత్వ ఆదేశాన్ని అమలు చేస్తున్నా.. పురపాలక శాఖలో మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీనిపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    సీడీఎంఏ మోకాలడ్డు
    అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెంచిన జీతాలను ఇచ్చేందుకు నగరపాలక సంస్థ, మున్సిపల్, నగర పంచాయతీల పాలక మండళ్లు ఆమోద ముద్రవేశాయి. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను కమిషనర్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేష¯ŒS(సీడీఎంఏ)కు పంపాయి. అయితే సీడీఎంఏ ఇప్పటివరకూ ఆ ఫైల్‌పై సంతకం చేయలేదు. జీఓ జారీ చేసి దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా మున్సిపల్‌ ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లుగా ఉన్నారు. చాలీచాలని జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఇంక్రిమెంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. వస్తున్న జీతాలు చాలకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వస్తున్న జీతాలతో పిల్లల స్కూల్‌ ఫీజులు, కుటుంబ ఖర్చులు నెట్టుకు రాలేకపోతున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమపై దయ చూపాలని వారు వేడుకుంటున్నారు.
     
    మూడు కేటగిరీలుగా విభజన
    మున్సిపల్‌ శాఖలో మూడు కేటగిరీల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని
    చేస్తున్నారు. సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అకౌంటెంట్ల జీతాలు రూ.17,500, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఫిట్టర్, మెకానిక్, లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర సిబ్బందికి రూ.15 వేలు, వాచ్‌మన్, మాలి, కమాలి, రికార్డ్‌ అసిస్టెంట్, క్యాషియర్‌ తదితరులకు రూ.12 వేల చొప్పున జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పైన పేర్కొన్న పోస్టులకు ఇచ్చే జీతాల లెక్క వేర్వేరుగా ఉంటోంది. ఒక కేటగిరీలో పని చేస్తున్న వివిధ పోస్టుల వారందరికీ ఒకేలా జీతాలు ఇచ్చేలా గత ఏడాది జీఓ జారీ అయింది.
     
     
    విభాగం నుంచి జీఓ జారీ కావాల్సి ఉంది
    ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. నిబంధనల ప్రకారం సంబంధిత విభాగం ప్రత్యేకంగా జీఓ జారీ చేయాలి. ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో జీఓ ఇచ్చింది. ఉన్నతాధికారులకు ఈ విషయం గుర్తు చేశాం. త్వరలోనే జీఓ వస్తుందని ఆశిస్తున్నాం. రాగానే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పెంచిన జీతాలు అమలు చేస్తాం.
    – టి.సకలారెడ్డి, రీజినల్‌ డైరెక్టర్, మున్సిపల్‌ పరిపాలన విభాగం
     
    జిల్లాలోని నగరపాలక సంస్థలు,
    పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పని చేస్తున్న అవుట్‌ సోరి్సంగ్‌ ఉద్యోగులు
    కాకినాడ : 591
    రాజమహేంద్రవరం : 1,037
    అమలాపురం : 116
    తుని : 98
    పిఠాపురం : 73
    సామర్లకోట : 116
    మండపేట : 58
    రామచంద్రపురం : 54
    పెద్దాపురం : 85
    ఏలేశ్వరం : 47
    గొల్లప్రోలు : 30
    ముమ్మిడివరం : 30
    మొత్తం : 2,335
     

Advertisement

తప్పక చదవండి

Advertisement