Sakshi News home page

అధికారంతో ఆక్రమించేశారు!

Published Wed, Jun 29 2016 1:00 AM

Municipal authorities Occupied by BR municipal school place

నిలువ నీడ లేక మురుగుకాల్వ గట్ల మీదో, ఏ పోరంబోకులోనే గుడిసెలు వేసుకుని జీవించే పేదలపై ప్రతాపం చూపించే అధికారులు  పట్టణ నడిబొడ్డున విలువైన స్థలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంటే మాత్రం మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంగళగిరి (తాడేపల్లి రూరల్) : గత నెల రోజులుగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో రత్నాలచెరువు మురుగుకాలువల వెంట గుడిసెలు,హిందూ శ్మశానవాటికలో గుడిసెలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే వారికి అండగా నిలవడంతో వెనుతిరగకతప్పలేదు. ఈ నేపథ్యంలో పట్టణ నడిబొడ్డున స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఉన్న బీఆర్ మున్సిపల్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ఏకంగా రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంటే మాత్రం అధికారులకు కనిపించకపోవడం విశేషం.

గత మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకుని విజయం సాధించిన ప్రజాప్రతినిధి బీఆర్ స్కూలు ఆవరణలోని స్థలాన్ని మూడు సెంట్లు ఆక్రమించి కనీసం మున్సిపాల్టీకి భవన నిర్మాణానికి ఎలాంటి దరఖాస్తు చేయకుండా భవనం నిర్మించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ మూడు సెంట్ల విలువ ప్రస్తుతం యాభైలక్షల రూపాయలు చేస్తుందని తెలిసింది. ఎన్నో సంవత్సరాల క్రితం బంగ్లా వద్ద అటవీభూమి 25 సెంట్లలో పాఠశాల నిర్మించారు. పాఠశాలకు ఉత్తరం వైపున రోడ్డు చిన్నదిగా వుండడంతో రోడ్ వెడల్పు కోసం కొంత భూమిని వదిలేశారు.

రెండు రోడ్ల మూలమీద మూడు సెంట్ల ఖాళీ స్థలంపై కన్నేసిన స్థానిక ప్రజాప్రతినిధి వెంటనే అక్కడ నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారనే విమర్శలు రావడంతో అది తనసొంతానికి కాదని తమ పార్టీ కార్యాలయం కోసం అంటూ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. పార్టీల పేరుతో ఆక్రమణలు చేస్తే అధికారులు చర్యలు తీసుకోరా మరి అలాంటప్పుడు మిగిలిన పార్టీలు కూడా మున్సిపల్ స్థలాలను ఆక్రమించి పార్టీ కార్యాలయాల పేరుతో నిర్మాణాలు సాగిస్తే వదిలేస్తారా అని వివిధ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

పేదలకు అండగా వుంటున్నామని చెప్పుకుంటున్న పార్టీ ప్రజాప్రతినిధులే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలకు పూనుకోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు,పాలకులు వెంటనే మున్సిపల్ స్థలాల ఆక్రమణలను అడ్డుకుని వాటిని పట్టణాభివృద్ధికి కృషి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
 
ఎలాంటి దరఖాస్తు అందలేదు
ఈ విషయమై పట్టణ ప్రణాళికా విభాగం అధికారి మోహన్‌బాబును వివరణ కోరగా భవన నిర్మాణానికి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదన్నారు.ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టులో వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.స్థలానికి పట్టా వున్నట్టు భవనయజమాని, స్థానిక ప్రజాప్రతినిధి చెప్పారని తెలిపారు.
 
ఆ స్థలం పాఠశాలదే!
పాఠశాల ఆవరణలో భవనం నిర్మిస్తున్న స్థలం పాఠశాలదే. భవననిర్మాణం చేపట్టిన వెంటనే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌తో కలిపి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాం.అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక పార్టీ కార్యాలయం పేరునో లేక మరెవరిపేరునైనా పట్టా వుంటే ఆ పట్టా ఎవరు ఇచ్చారు..ఎలా వచ్చింది అనేదానిపై మున్సిపల్ అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలి. పట్టా నిజంగా వుంటే భవనానికి అనుమతులు ఇవ్వడంలో తప్పులేదు.
- సుఖమంచి కోటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్

Advertisement
Advertisement