నడిరోడ్డుపై హత్య | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై హత్య

Published Thu, Oct 20 2016 12:36 PM

రక్తపు మడుగులో విజేందర్ రాజు మృతదేహం, ఇన్సెట్లో నిందితుడు కోనారెడ్డి - Sakshi

♦  భయాందోళనకు గురైన జనం
♦  పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు..?
♦  వివాహేతర సంబంధమే కారణం?

కొత్తపల్లి (జమ్మికుంట రూరల్‌):
జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. నిందితుడు వెంటపడి మరీ కత్తితో మెడ, చాతిపై పొడిచిన సంఘటన తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఇది చూసిన జనం భయబ్రాంతులకు లోనయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మికుంటలో మూడు దశాబ్దాలపాటు సర్పంచ్‌గా పనిచేసిన ఎర్రంరాజు కృష్ణంరాజు మూడో కుమారుడు విజేందర్‌రాజు(42) కొంతకాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే రంగంలో ఉన్న కొత్తపల్లిలో నివాసముంటున్న జూనూతుల కోనారెడ్డితో వృత్తిపరంగా సంబంధాలు ఏర్పడ్డాయి. తరచూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఈ క్రమంలో విజేందర్‌ భార్యతో కోనారెడ్డికి సాన్నిహిత్యం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు సమాచారం.

ఈ విషయం విజేందర్‌రాజుకు తెలియడంతో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కాగా బుధవారం కోనారెడ్డి.. విజేందర్‌రాజుకు ఫోన్‌ చేసి కొత్తపల్లికి రప్పించి కత్తితో పొడిచాడు. విజేందర్‌రాజు హత్యలో మరికొందరి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే హత్య చేసిన వెంటనే నిందితుడు తన స్నేహితుని ద్వారా ద్విచక్ర వాహనంపై వచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి కుమారుడు సాయికృష్ణంరాజు(5) ఉన్నాడు. సంఘటనా స్థలంలో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని హుజూరాబాద్‌ ఏసీపీ మూల రవీందర్‌రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను సేకరించారు. నిందితుని స్వగ్రామం వీణవంక మండలం బొంతుపల్లి. కొన్నేళ్లుగా జమ్మికుంటలో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవలే కొత్తపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు.

Advertisement
Advertisement