లాయర్‌ హత్యకేసులో నిందితులకు జీవితఖైదు | Sakshi
Sakshi News home page

లాయర్‌ హత్యకేసులో నిందితులకు జీవితఖైదు

Published Fri, Aug 19 2016 10:54 PM

లాయర్‌ హత్యకేసులో నిందితులకు జీవితఖైదు

  • కోర్టు తీర్పుపై న్యాయవాదులు హర్షం
  • రాజమహేంద్రవరం క్రైం :
    న్యాయవాది విన్నకోట కల్యాణ్‌ కిడ్నాప్, హత్యా కేసులో ప్రధాన నిందితులు ఇద్దరికి జీవిత ఖైదు, వారికి సహకరించిన మరో ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఒక మహిళ కేసు విషయంలో న్యాయవాది కల్యాణ్‌ను ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలో కిడ్నాప్‌ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహం కనిపించకుండా చేసేందుకు నిందితులు చేసిన ప్రయత్నం సినిమా ఫక్కీని తలపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. 2010 ఫిబ్రవరి 22వ తేదీన కల్యాణ్‌ ప్రకాష్‌నగర్‌  పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తుండగా వెనుక కారులో వచ్చిన నిందితులు కల్యాణ్‌ వీపు మీద కొట్టి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే కల్యాణ్‌ తప్పించుకొని సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి పారిపోగా అక్కడకు వెళ్లి బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తల నుంచి పాదం వరకూ ఒక్కొక్క అవయవంపై కొట్టుకుంటూ మారేడుమిల్లి టైగర్‌ ఫారెస్ట్‌ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కొన ఊపిరితో ఉన్న కల్యాణ్‌ ముఖంపై బండరాయితో మోది హత్య చేసి మృతదేహం కనిపించకుండా లోయలోకి విసిరి వేశారు. లాయర్ల ఆందోళనలతో స్పందించిన పోలీసులు ఎట్టకేలకు నాలుగు రోజుల అనంతరం చెట్లలో చిక్కుకుపోయిన కుళ్లిన కల్యాణ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బుక్కా శివ కుమార్‌కు, రెండవ నిందితుడు సందిసారి ప్రణయ్‌ కుమార్‌కు జీవిత ఖైదీ విధిస్తు 9 వ జ్యుడీషియల్‌ జిల్లా జడ్జి, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి సి. పురుషోత్తమ కుమార్‌ శుక్రవారం  తీర్పు చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితులు కడియాల కాలేష్, పోలమాటి పవన్‌ కళ్యాణ్, సందిసారి వినయ్, తుమ్మల క్రాంతి కుమార్, బుక్కా కనకయ్యలకు ఏడు ఏళ్లు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కేఎస్‌ గోపాలరావు వాదించారు. ప్రాసిక్యూషన్‌ అసిస్టెంట్‌గా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితులను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. 
    తీర్పుపై న్యాయవాదులు హర్షం
    కల్యాణ్‌ హత్య కేసులో కోర్టు తీర్పుపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.  రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాది తన క్లయింట్‌ల కేసులు ధైర్యంగా వాదించేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని అన్నారు. న్యాయవాదులను ఏం చేసినా చెల్లుతుందనుకొనే నిందితుల దురుద్ధేశ్యపూర్వకమైన ఆలోచనలకు చరమగీతం పాడినట్టు అయిందని అన్నారు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి సహకరించిన, మృతదేహం దొరికే వరకూ ఉద్యమించిన న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  
     

Advertisement

తప్పక చదవండి

Advertisement