ఆవేశంతోనే హత్య | Sakshi
Sakshi News home page

ఆవేశంతోనే హత్య

Published Mon, Jul 25 2016 7:15 PM

ఆవేశంతోనే హత్య - Sakshi

  • జాగిలం క్లూస్‌తో హత్య మిస్టరీ ఛేదించిన పోలీసులు 
  • గూడూరు :వారిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. మద్యం మత్తులో ‘వాడ్ని వేసేయండ్రా’ అని ఆవేశంగా అన్న మాట ఓ దారుణ హత్యకు దారి తీసింది. హత్యచేసి ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన సంఘటలో నిందితుడిని పోలీస్‌ జాగిలం ఇచ్చిన క్లూస్‌ ఆధారంగా మిస్టరీని ఛేదించినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన  విలేకరుల సమావేశంలో హత్యకు దారితీసిన ఉదంతాన్ని వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి  నాయుడుపేట సమీపంలోని తుమ్మూరులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆపై ఆనవాలు గుర్తించకుండా దహనం చేసిన ఘటన పోలీసులకు సవాల్‌గా నిలిచింది. నాయుడపేట సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతీకృష్ణ దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందుకూరుపేట మండలం నరుకూరుకు చెందిన పాలెపు హజరత్‌ (29) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో తుమ్మూరులోని తన మామ పుల్లయ్య ఇంటికి కొద్ది రోజుల క్రితం వచ్చాడు. హజరత్‌ ఈ నెల 19వ తేదీ రాత్రి కొందరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్లలేని స్థితిలో ఉన్న హజరత్‌ సమీపంలో ఉన్న ఓ పూరి గుడిసెలో పడి నిద్రపోయాడు. ఆ గుడిసె అదే ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి నాగూరుయ్య కుమారుడు నాగరాజుది. నాగరాజు అక్కడే ఉంటూ పెయింట్‌ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు.  నాగరాజు పనులు పూర్తి చేసుకుని వచ్చేసరికి తన గుడిసెలో మద్యం మత్తులో నిద్రపోతున్న హజరత్‌ కనిపించాడు. కోపోద్రేకానికి గురైన నాగరాజు అతన్ని గుడిసెలోంచి బయటకు లాగేశాడు. దీంతో హజరత్‌తో ఉన్నవారు సర్ది చెప్పారు. హజరత్‌ మద్యం మత్తులో ఉండి ‘ఆడ్ని వేసేయండిరా’ అని అన్నాడు. అది విన్న నాగరాజు ఆవేశంతో హజరత్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొంత సేపటికి హజరత్‌ను పక్కనే ఉన్న మూసేసిన బంక్‌ వద్ద పడుకోబెట్టి ఎవరి ఇళ్లుకువారెళ్లిపోయారు. అది గమనిస్తూ ఉన్న నాగరాజు పక్కనే ఉన్న సిమెంట్‌ కాంక్రీట్‌ రాయితో మోది హజరత్‌ను చంపేశాడు. మృతుడి ఆనవాలు కనిపెట్టకుండా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి తనకు విరోధి అయిన చంద్రకళ అనే మహిళకు చెందిన ఇంటి ముందు ఉంచి కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో సీఐ, ఎస్సైలు పోలీస్‌ జాగిలాన్ని ఇచ్చిన క్లూస్‌ ఆధారంగా మిస్టరీని ఛేధించి, నిందుతుడు నాగరాజును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిస్టరీని ఛేదించిన సిబ్బందికి రివార్డులకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement