హత్యా..! ఆత్మహత్యా..! | Sakshi
Sakshi News home page

హత్యా..! ఆత్మహత్యా..!

Published Thu, Nov 17 2016 10:54 PM

హత్యా..! ఆత్మహత్యా..!

- అనుమానాస్పద స్థితిలో తోడికోడళ్లు మృతి
- పోలీసుల అదుపులో అత్త, మామ, భర్త
- మృతదేహాలను పరిశీలించిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ
రాజంపేట:
వారిద్దరూ తోడికోడళ్లు..కలిసిమెలిసి జీవించాల్సిన వీరు ఒకేసారి మృత్యు ఒడిలోకి  వెళ్లారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యకు గురయ్యారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఈ సంఘటన రాజంపేట మండలం  సిద్ధులపల్లె కొత్తరాచపల్లెలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మల్లికార్జునరాజు, భాగ్యమ్మ దంపతులకు మల్లయ్య, వెంకటేశ్వరరాజు కుమారులు ఉన్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. తాళ్లపాకకు చెందిన దివ్య (18)తో వెంకటేశ్వరరాజుకు, సిద్ధులపల్లెకు చెందిన జ్యోత్స్న(18)తో మల్లయ్యకు వివాహమైంది. జ్యోత్స్నకు యేడాది పాప కూడా ఉంది. దివ్య భర్త వెంకటేశ్వరరాజు జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. వీరంతా ఉమ్మడి కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో తోడికోడళ్లు మృతి
జ్యోత్స్న, దివ్యల మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయాన్నే అత్త,మామ ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లినట్లుగా చెబుతున్నారు. సాయంత్రం వరకు వేసిన తాళాలు తెరవకపోవడంతో ఇంటిలో ఉన్న కోడళ్లు ఏమయ్యారనే అనుమానాలు గ్రామస్తుల్లో పుట్టుకొచ్చాయి. ఉదయం వెళ్లిన అత్త,మామ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. వీరితో పాటు జ్యోత్స్న భర్త మల్లయ్య కూడా చేరుకున్నాడు. వారు అక్కడికి రాగానే గ్రామస్తులు వెళ్లి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని తోడికోడళ్ల అత్తమామలు అడ్డుకున్నారు. అయినప్పటికీ గ్రామస్తులు తలుపులు తీసి చూడగా  తోడికోడళ్లు విగత జీవులుగా పడి ఉన్నారు. వారు ఎప్పుడు చనిపోయారు? ఆత్మహత్య చేసుకుంటే అప్పుడే తెలిసేది కదా? ఒక వేళ అత్తమామ, భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు
తోడికోడళ్లు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, సీఐ హేమసుందరావు, ఎస్‌ఐ నాగరాజులు తమ సిబ్బందితో కొత్తరాచపల్లె గ్రామానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు అత్త, మామ,భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ నాగరాజుతెలిపారు.

Advertisement
Advertisement