పరిహారం ఇవ్వాల్సిందే | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వాల్సిందే

Published Thu, Dec 8 2016 10:56 PM

పరిహారం ఇవ్వాల్సిందే - Sakshi

  •  జిల్లాలో రూ.4 వేల కోట్ల పెట్టుబడి నష్టం
  • వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి  
  • డి.హీరేహాళ్‌:     ‘పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. పంట ఎండిపోయింది. ఎండిన పంటకు ఎంత నష్టం వాటిల్లితే అంత బీమా కంపెనీ ఇవ్వాలి. లేదంటే ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా ప్రభుత్వం చెల్లించాలి. కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. రైతుకు హక్కుగా రావాల్సిన డబ్బులను చిల్లర రూపంలో భిక్ష వేస్తారా?' అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు.

    సోమలాపురంలో గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ''15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ.750 కోట్లు, కంది, జొన్న, మిరప అన్ని పంటలు కలిపి మొత్తంగా 18 లక్షల ఎకరాలకు రూ.4 వేల కోట్లు పెట్టుబడి రైతులు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వ ముందుచూపులేమి, హంద్రీ–నీవా నీటిని ప్రణాళిక లేకుండా ధారాదత్తం చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా పంట నష్టపోయేందుకు ప్రభుత్వం కారణమైంది. రైతులు ఖర్చు చేసిన డబ్బులు బీమా కంపెనీతో ఇప్పించాలి. లేదంటే ఇన్‌పుట్‌సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఇవ్వాలి. ఇది రైతుల హక్కు! కానీ ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. రైతులు నష్టపోయిన పెట్టుబడి ఇవ్వాలని డిమాండ్‌ చేయాల్సిన టీడీపీ నేతలు రాజధానిలో తలూపి వచ్చేశారు. పైగా 2015కు సంబంధించి 63 కరువు మండలాలను ప్రకటించారు. గత నెల 10న ఇన్‌పుట్‌సబ్సిడీపై జీవో జారీ చేశారు. అందులో 8 జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పేరు లేదు. ఎందుకు జిల్లాపై ఈ వివక్ష! ఈ ఏడాది నష్టపోయిన పెట్టుబడి పూర్తిగా ఇవ్వాల్సిందే!'' అని ఆయన డిమాండ్‌ చేశారు.  అలాగే హెచ్చెల్సీ, జీబీసీ, ఎల్‌ఎల్‌సీ రైతులు కూడా నష్టపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే హెచ్చెల్సీ రైతులకే పంగనామం పెట్టారు. హెచ్చెల్సీ రైతులకు ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో 3.1/2 టీఎంసీల నీటిని జిల్లా రైతులకు హక్కుగా కేటాయించారు. అలాకాకుండా కర్నూలు జిల్లాకు ఆ నీటిని ధారాదత్తం చేసి ఇక్కడ రైతులకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేశారన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే కోర్టుకు ఇడుస్తామని ఆయన హెచ్చరించారు. హెచ్చెల్సీ, వర్షాధారం క్రింద సాగు చేసిన రైతులందరికి బేషరతుగా పంట రుణాలను రద్దు చేయాలి లేదా అంతే మొత్తంలో పరిహారం చెల్లించాలన్నారు. పార్టీ రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఉపాధి నిధులను  నీరు – చెట్టు  కార్యక్రమానికి  మళ్లించి, యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీల కడుపుకొడుతున్నారని విమర్శించారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అధికారులంతా జైలుకు వెళతారని హెచ్చరించారు.

    కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, సదాశివరెడ్డి, ఎస్టీ సెల్‌ కార్యదర్శి భోజరాజు నాయక్, ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బీటీపీ గోవిందు, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్లికార్జున, మండల కన్వీనర్లు వన్నూరుస్వామి, మల్లికార్జున, మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.




     

Advertisement
Advertisement