రాజమహేంద్రవరంలో ఉంటే.. నాన్న ఒడిలో కూర్చున్నట్లుంది | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరంలో ఉంటే.. నాన్న ఒడిలో కూర్చున్నట్లుంది

Published Sun, Apr 16 2017 10:56 PM

రాజమహేంద్రవరంలో ఉంటే.. నాన్న ఒడిలో కూర్చున్నట్లుంది

‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి
కన్నుల పండువగా ఆయనకు ‘బి.నాగిరెడ్డి’ స్మారక పురస్కారం ప్రదానం
సాక్షి, రాజమహేంద్రవరం : తన తండ్రి పుట్టిన రాజమహేంద్రవరంలో ఉంటే ఆయన ఒడిలో కుర్చున్నట్లు ఉందని జాతీయ అవార్డు పొందిన ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. తన తండ్రివల్లే తాను నిర్మాతగా మారానని చెప్పారు. ఉత్తమ చిత్రాల నిర్మాతలకు ఇచ్చే బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని రాజ్‌ కందుకూరికి స్థానిక ఆనం కళాకేంద్రంలో ఆదివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌ మాట్లాడుతూ, ఈ పురస్కారం తన జీవితంలో ప్రతేకమైనదన్నారు. పురస్కార ప్రదాతలు బి.నాగిరెడ్డి కుమారుడు వెంకటరామిరెడ్డి, భారతీరెడ్డి దంపతుల చేతుల మీదుగా రాజ్‌ ఈ పురస్కారం అందుకున్నారు. భారతీరెడ్డి మాట్లాడుతూ, తన మామ పేరు మీదుగా 2011 నుంచి ఉత్తమ చిత్ర నిర్మాతలకు బి.నాగిరెడ్డి స్మారక అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. ఎంపికకు సహకరించిన జ్యూరీ సభ్యులు ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావుకు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విలక్షణ నటుడు జగపతిబాబు మాట్లాడుతూ, రాజమహేంద్రవరంతో తనకు విడదీయరాని అనుబంధముందన్నారు. తన అత్తమామల ఊరు ఈ ప్రాంతమేనని, వారిద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారని తెలిపారు. ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, చిన్న సినిమాల నిర్మాతలకు ఈ పురస్కారం ప్రాణం పోస్తుందన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న నగర పాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాజమహేంద్రవరం ప్రజలు తమ సహకారం అందిస్తారని చెప్పారు. ప్రభుత్వం తరఫున తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ బృందం ఆలపించిన పాటలు ప్రేక్షకులను రంజింపజేశాయి. చిన్నారి ప్రవస్తి పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, మధుఫామ్రా ఎండీ మధు, నటుడు జిత్‌మోహన్‌మిత్రా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement