నారాయణఖేడ్‌లో నేడు పోలింగ్ | Sakshi
Sakshi News home page

నారాయణఖేడ్‌లో నేడు పోలింగ్

Published Sat, Feb 13 2016 6:24 AM

నారాయణఖేడ్‌లో నేడు పోలింగ్ - Sakshi

ఏర్పాట్లన్నీ పూర్తి
ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్   


నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ శనివారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్‌ను నిర్వహిస్తారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలి టెక్నిక్ కళాశాల ఆవరణలో ఎన్నికల సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆయా పార్టీల నాయకుల సమక్షంలో స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలను  తీసుకువచ్చారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని అధికారులకు అప్పగించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
 
286 పోలింగ్ కేంద్రాలకు గాను 33 రూట్లను విభజించారు. 142 పోలింగ్ కేంద్రాల్లో  వెబ్‌కాస్టింగ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మరో 144 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సిగ్నల్స్ లేకపోవడంతో కంప్యూటర్ ద్వారా రికార్డింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాలకు గాను 76 అదనంగా కలిపి 366 ఈవీఎంలను సిద్ధం చేశారు. వీటితోపాటు తహశీల్దార్, సెక్టార్ అధికారుల వద్ద మూడు చొప్పున ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ రికార్డింగ్‌కు గాను సుమారు 300 మంది ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులను సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, జేసీ వెంకట్‌రామిరెడ్డి, సీఈఓ వర్షిణి, ఆర్డీఓలు మధుకర్‌రెడ్డి, మంచు నగేష్, డ్వామా పీడీ సురేంద్ర కరణ్, రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.  
 
 కనీస వసతులు లేక ఉద్యోగుల ఆందోళన
 నారాయణఖేడ్: తమకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద సిబ్బందికి భోజనం, తాగునీటి వసతి లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు దృష్టికి  తీసుకెళ్లారు. భోజనం, తాగునీరు లేకపోతే తాము విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. వెంటనే తగు ఏర్పాట్లు చేస్తామని రిటర్నింగ్ అధికారి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Advertisement
Advertisement