ప్రాణం తీసిన మిస్‌ఫైర్! | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మిస్‌ఫైర్!

Published Wed, Feb 17 2016 2:24 AM

ప్రాణం తీసిన మిస్‌ఫైర్! - Sakshi

హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో పేలిన పిస్టల్
నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ అక్బర్ అక్కడికక్కడే మృతి
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యే గన్‌మన్ రవీందర్

 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని మరో గన్ పేలింది! హిమాయత్‌నగర్‌లో డాక్టర్ కాల్పుల ఉదంతం మరవకముందే హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే కార్టర్స్‌లో పిస్టల్ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి ప్రైవేట్ డ్రైవర్ సయ్యద్ అక్బర్ (26) అక్కడిక్కడే మృతి చెందాడు. ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్‌ఓ) నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు నిర్ధారించారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

 15 ఏళ్లుగా ఎమ్మెల్యే వద్దే..
 ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెంట మంగళవారం .9 ఎంఎం కార్బైన్ తుపాకీతో పాండు, .9 ఎంఎం పిస్టల్‌లో రవీందర్ విధుల్లో ఉన్నారు. 2009 బ్యాచ్ ఆర్డ్మ్ రిజర్వ్ కానిస్టేబుల్ అయిన రవీందర్ ఏడాదిన్నరగా ఎమ్మెల్యే వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం చౌదరిపల్లికి చెందిన సయ్యద్ అక్బర్ 15 ఏళ్లుగా మదన్‌రెడ్డి ఇంట్లో పని చేస్తున్నాడు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేకు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లికి చెందిన వెంకట్ కూడా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

 పిస్టల్ ఎలా లోడ్ అయింది?
 ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఫ్లాట్ నెం.507లో మదన్‌రెడ్డి నివసిస్తుండగా... డ్రైవర్లు, పీఎస్‌ఓల కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లో గదులు కేటాయించారు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు పీఎస్‌ఓలు, ఇద్దరు డ్రైవర్లు ఆ గదిలోనే ఉన్నారు. ఆ సమయంలో రవీందర్ పిస్టల్‌ను పౌచ్‌తో సహా తాను కూర్చున్న మంచంపై ఉంచాడు. పక్కనున్న మంచంపై కూర్చుని దాన్ని చేతుల్లోకి తీసుకున్న వెంకట్  ఆపరేట్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆయుధాన్ని తన చేతుల్లోకి తీసుకున్న రవీందర్..  ఎలా పని చేస్తుందో వివరించాడు. ఈ నేపథ్యంలోనే సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో పాటు మ్యాగ్జైన్‌లో ఉండే తూటాల్లో ఒకటి ఛాంబర్‌లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించని రవీందర్ పిస్టల్‌ను తిరిగి మంచంపై పెట్టాడు.

 తుపాకీ పేలింది ఇలా..
 పిస్టల్‌ను భద్రపరచాల్సిన రవీందర్ నిర్లక్ష్యంతో దాన్ని మంచంపైనే ఉంచాడు. దీంతో పిస్టల్‌ను పరిశీలిద్దామన్న ఉద్దేశంతో ఎదురుగా నిల్చున్న అక్బర్ దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పిస్టల్ పైభాగంలో ఉండే స్లైడర్‌ను లాగడానికి యత్నించాడు. దీంతో కంగారుపడిన రవీందర్ ఆయుధాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. పిస్టల్ రవీందర్ చేతుల్లోకి వస్తుండగానే.. అతడి వేలు పొరపాటున ట్రిగ్గర్‌పై పడింది. అప్పటికే పిస్టల్ లోడ్ అయి ఉండటంతో వెంటనే పేలింది. ఎదురుగా నిల్చున్న అక్బర్ ఛాతి భాగంలోకి దూసుకు వెళ్లిన బుల్లెట్ వెనుక నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అక్బర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే ఫ్లాట్‌లో ఉన్న ఎమ్మెల్యేకి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే సమాచారాన్ని మెదక్ ఎస్పీకి తెలిపారు. మెదక్ ఎస్పీ ద్వారా సమాచారం అందుకున్న మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు ప్రత్యక్షసాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. పిస్టల్‌తో పాటు కొన్ని తూటాలను సీజ్ చేశారు. తుపాకీ ఎవరి చేతిలో ఉండగా పేలిందో సాంకేతికంగా నిర్ధారించుకునేందుకు మృతుడు అక్బర్, గన్‌మన్ రవీందర్, మరో డ్రైవర్ వెంకట్ నుంచి గన్‌షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. రవీందర్‌పై అక్బర్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304(ఎ) ప్రకారం నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 గదిలో మద్యం బాటిళ్లు..
 ఘటన సమయంలో రవీందర్, అక్బర్ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారని కొందరు వ్యక్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ గదిలో కొన్ని మద్యం సీసాలు కూడా ఉండటంతో పోలీసులు.. రవీందర్‌కు బ్రీత్ అనలైజర్‌తో  పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో రవీందర్ మద్యం తాగలేదని తేలింది. దర్యాప్తు అనంతరం రవీందర్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ‘పీఎస్‌ఓ నిర్లక్ష్యం కారణంగానే మిస్‌ఫైర్ జరిగి ఓ ప్రాణం పోయింది. ఘటనాస్థలి, ప్రత్యక్షసాక్షుల కథనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి మీడియాకు చెప్పారు.
 
 ఆ ఇంటికి అక్బరే పెద్దదిక్కు...
 వెల్దండ: అక్బర్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి అమీరుద్దీన్ పదేళ్ల కిందటే చనిపోయాడు. ఐదుగురు సంతానంలో అక్బర్ మూడోవాడు. తన అక్క, చెల్లెలు పెళ్లిళ్లు అక్బరే చేశాడు. అన్న సలీమ్ పెళ్లి చేసుకుని కుటుంబపరంగా వేరుపడ్డాడు. సోదరి రేష్మ పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో అన్నీతానై చూసుకుంటున్నాడు. కష్టపడి చెల్లెలు ఫాతిమా వివాహం జరిపించాడు. మరో సోదరుడు జహంగీర్ స్థానికంగానే ఆటో నడుపుకుంటూ జీవ నోపాధి పొందుతున్నాడు.
 
 పైసలడిగాడని వేరే డ్రైవర్‌ను పెట్టుకున్నాడు
 ‘‘మా అబ్బాయి అక్బర్ కొద్దికాలం క్రితం ఇల్లు కట్టుకునేందుకు ఎమ్మెల్యే సాబ్‌ను పైసలడిగాడు. దీంతో ఎమ్మెల్యే.. ‘పొద్దాక పైసలడుగుతావా.. చేస్తే చెయ్యి లేకుంటే మానేయ్.. నీ సంగతి చెప్తా..’ అని కోపగించుకున్నారు’’ అని అక్బర్ తల్లి సయ్యద్ దర్జానీ, చిన్నమ్మ రషీదా అరోపించారు. మంగళవారం రాత్రి నారాయణగూడ పోలీస్‌స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంతో కాలంగా ఎమ్మెల్యే దగ్గర అక్బర్ పనిచేస్తున్నాడు. మా కుటుంబ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు ఎమ్మెల్యేని డబ్బులు అడిగితే ఇవ్వలేదు. కొద్దిరోజుల కిందట ఇల్లు కట్టుకునేందుకు మళ్లీ డబ్బులడిగితే ఎమ్మెల్యే కోపగించుకొని, నీ సంగతి తేలుస్తా అన్నా డు. కొన్ని రోజుల తర్వాత వేరే డ్రైవర్‌ను పెట్టుకున్నాడు’’ అని వారు పేర్కొన్నారు. కొత్త డ్రైవర్‌తో అక్బర్‌కు కొద్ది రోజులుగా తగాదాలు జరిగాయని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement