మేడారం జాతరకు జాతీయ హోదా!! | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు జాతీయ హోదా!!

Published Sat, Jan 23 2016 9:14 PM

మేడారం జాతరకు జాతీయ హోదా!! - Sakshi

హన్మకొండ: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర. ఈ జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం హన్మకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మేడారం జాతర ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేశామని, కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కూడా జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఈ జాతరకు  జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.

ఈ విషయంలో ఎంపీగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. జాతరపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందిస్తామని, ఈ డాక్యుమెంటరీ ద్వారా మేడారం జాతర విశిష్టతను, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల పాలనలో జాతర పనులు సక్రమంగా జరిగేవి కావని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మందుగానే మంజూరుచేసి పనులు ముమ్మరం చేసిందన్నారు. జాతరకు 15 రోజుల ముందే పనులు పూర్తి కానున్నాయన్నారు.

సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో గిరిజన విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై విచారణ పూర్తయితేనే వాస్తవాలు తెలుస్తాయని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థినుల తల్లిదండ్రులపై కేసు పెట్టిన అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌బాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement