కొండంత నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

కొండంత నిర్లక్ష్యం

Published Tue, Jul 26 2016 12:36 AM

కొండంత నిర్లక్ష్యం - Sakshi

– రెండు నెలల క్రిందటే స్వయంగా లేఖ రాసిన ఎస్పీ 
– పట్టించుకోని ఉన్నతాధికారులు 
– సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ 
– రెండు రోజులుగా శ్రీశైలంలోనే మకాం 
– మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు నివేదన
సాక్షి ప్రతినిధి, కర్నూలు :  శ్రీశైలంలో కొండచరియ విరిగిపడిన ప్రమాదంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కొండ చరియ విరిగిపడే ప్రమాదం పొంచివుందని రెండు నెలల కిందట స్వయంగా ఎస్పీ లేఖ రాసినప్పటికీ జిల్లా అధికారులు స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పాతాళగంగ ఘాట్‌ వద్దకు వెళ్లే ్రప్రాంతంలో కొండను తొలుస్తూ చేపట్టిన రోడ్ల వల్ల పైనుంచి కొండ చరియలు విరిగిపడి భక్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని మే నెలలోనే జిల్లా ఉన్నతాధికారులకు ఎస్పీ ఆకే రవికష్ణ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చరియలు విరిగిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. ఇందుకోసం... 
1. ఇనుప కంచెతోటి భద్రత వలయాలను ఏర్పాటు చేయాలి. 
2. సివిల్‌ ఇంజనీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలతో రోడ్డు మార్గపు పనులను అధ్యయనం చేయించాలి. 
3. ఆగస్టు నెలలో పుష్కరాలు జరగనున్నాయి. ఇదే నెలలోనే వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశం ఉంది. తద్వారా కొండ చరియలు మరింత విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా పుష్కర భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అని ఆయన రాసిన లేఖలోఓ పేర్కొన్నారు. ఈ మొత్తం పరిణామాలు శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కల్పించే అవకాశం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే లేఖ రాసి రెండు నెలలు గడిచినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులెవరూ కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫలితంగా రెండు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు కాని, పనిచేసేవారు కాని లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ఇదే ఘటన పుష్కరాల సమయంలో జరిగి ఉంటే అన్న ప్రశ్న అధికారులను ఇప్పుడు వేధిస్తోంది. 
జిల్లా ఎస్పీ సీరియస్‌... 
కొండచరియలు కూలిన ఘటనపై జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ తీవ్రంగా స్పందించారు. స్వయంగా తాను లేఖ రాయడంతో పాటు పుçష్కరాల సమీక్ష సమావేశంలో ఐదారు సార్లు ఈ  సమస్య లేవనెత్తినప్పటికీ అధికారులెవరూ స్పందించకపోవడంపై ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఇదే నేపథ్యంలో శ్రీశైలంలోనే రెండు రోజులుగా మకాం వేశారు. అదే విధంగా మంగళవారం కూడా అందుబాటులో ఉన్న అధికారులందరితో శ్రీశైలంలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. 
ఉన్నతాధికారుల దష్టికి...
శ్రీశైలంలో కొండ చరియలు విరిగిన ఘటనను ఉన్నతాధికారులకు ఎస్పీ రవికష్ణ నివేదించారు. ఇందులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన నివేదించినట్లు తెలిసింది. అదే విధంగా కష్ణా పుష్కరాలకు తీసుకోవలసిన భద్రత విషయంలోనూ అధికారులు మిన్నకుండిపోతున్న విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు సవివరంగా నివేదించినట్లు తెలిసింది. మొత్తం మీద శ్రీశైలంలో కొండ చరియ విరిగిపడిన ఘటన కాస్తా కష్ణా పుష్కరాలకు జిల్లాలో భక్తుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపైనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement