‘రెవెన్యూ’కు ట్యాబ్స్ | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’కు ట్యాబ్స్

Published Thu, Mar 3 2016 2:41 AM

‘రెవెన్యూ’కు ట్యాబ్స్ - Sakshi

వీఆర్‌ఓల నుంచి తహసీల్దార్ల వరకు పంపిణీ
సమాచారం పంపాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు
‘వెబ్‌ల్యాండ్’ నిర్వహణ సులభతరం

 సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ శాఖను సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్న ఈ శాఖను సుపరిపాలన దిశగా నడిపించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. రెవెన్యూ రికార్డులను చిటికెలోనే తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ ఉద్యోగులకు కూడా టాబ్లెట్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి సర్వే నంబర్ పుట్టు పూర్వోత్తరాలు, క్షేత్రస్థాయిలో స్థితిగతులతో కూడిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ‘వెబ్‌ల్యాండ్’ పేర కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. తాజాగా క్రోడీకరించిన ఈ సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునేలా గ్రామ రెవెన్యూ అధికారి మొదలు మండల తహసీల్దార్ వరకు  టాబ్లెట్‌లను అందజేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పంపాలని రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమాండ్‌పీటర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారి, పోస్టింగ్, ఖాళీలను తెలిపేలా రూపొందించిన ఫార్మెట్‌కు అనుగుణంగా సమాచారాన్ని నివేదించమని సూచించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో పనిచేస్తున్న 434 మంది వీఆర్‌ఓలు, 65 మంది ఆర్‌ఐలు, 59 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 37 మంది తహసీల్దార్లకు టాబ్లెట్లు రానున్నాయి.

Advertisement
Advertisement