Sakshi News home page

రేపటి నుంచి ఉల్లి క్రయ,విక్రయాలపై నిఘా

Published Sun, Oct 16 2016 11:31 PM

రేపటి నుంచి ఉల్లి క్రయ,విక్రయాలపై నిఘా

–ఎకరాలకు 80 క్వింటాళ్లకు మద్దతు వర్తింపు
కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి క్రయ, విక్రయాలు ఈ నెల18 నుంచి జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో జరుగుతాయి. యథావిధిగా వేలంపాట ద్వారా ఉల్లి క్రయ, విక్రయాలు జరుగుతున్నా మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఉల్లి నాణ్యతకు అనుగుణంగా వేలంపాటలో ధరలు లభిస్తున్నాయా.. నాణ్యత బాగున్నా....తక్కువ ధర లభించిందా.. ఇందుకు కారణాలు ఏమిటీ అనే దానిని ఈ బృందం పర్యవేక్షిస్తుంది. గ్రేడింగ్‌లు నిర్ణయించేందుకు ఉద్యాన అధికారులు, మార్కెటింగ్‌ అధికారులతో మరో బృందం ఏర్పాటైంది. ఒక ఎకరాకు గరిష్టంగా 80 క్వింటాళ్ల ఉల్లికి మద్దతు ధర లభిస్తుంది. ఇన్ని ఎకరాల వరకు మద్దతు ఇస్తామనే నిబంధన లేదు. అయితే వెబ్‌ల్యాండ్‌Š లోని భూముల వివరాలు, ఇ క్రాప్‌ బుకింగ్‌ వివరాలు పరిశీలించిన తర్వాత  సక్రమంగా ఉంటే మద్దతు వర్తింప చేస్తారు. గ్రేడింగ్‌లోకి రాని ఉల్లికి ఎటువంటి మద్దతు ఇవ్వడం ఉండబోదని మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి తెలిపారు.వేలంపాటలో రూ.50 నుంచి రూ300 వరకు ధర లభించినా ప్రభుత్వం మద్దతు రూ.300 లభిస్తుందని ఆయన తెలిపారు. గరిష్టంగా రూ.300 మాత్రమే మద్దతు ఇస్తామని వివరించారు. రూ.400 లభిస్తే ప్రభుత్వ మద్దతు రూ.200, రూ.500 ధర లభిస్తే మద్దతు రూ.100 లభిస్తుందని వివరించారు. రీ సైక్లింగ్‌కు తావులేకుండా కట్టుడిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉల్లి ఎక్కువగా పండే రైతులు వారంలో మూడు రోజులు, ఆదోని డివిజన్‌ రైతులు రెండు రోజులు, నంద్యాల డివిజన్‌ రైతులకు ఒక్క రోజు ఉల్లి తెచ్చుకొని అమ్మకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement