డబ్బులేవీ | Sakshi
Sakshi News home page

డబ్బులేవీ

Published Thu, Dec 1 2016 1:28 AM

డబ్బులేవీ - Sakshi

  •  బ్యాంకుల్లో నిండుకున్న నగదు
  •  రిజర్వ్‌ బ్యాంకు నుంచి అరకొరగా నగదు సరఫరా
  •  వారానికి రూ.5 వేలే ఇస్తున్న బ్యాంకులు
  •  22 రోజులు గడిచినా తగ్గని జనం రద్దీ
  • ఏటీఎంలకు దీర్ఘ కాలిక సెలవు
  •  ఉద్యోగులకు రూ.10 వేల జీతం చేతికిచ్చేది అనుమానమే
  • తలుపులు మూసేసిన బ్యాంకులు
  •  డిపాజిట్లు మాత్రమే తీసుకుంటున్న పోస్టాఫీసులు
  • సాక్షి ప్రతినిధి – నెల్లూరు :
    కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి 22 రోజులు గడిచింది. అయినా నేటీకి జనం నోట్ల బాధలు తీరలేదు. బ్యాంకుల వద్ద తగ్గని జనం క్యూలు. బ్యాంకు  ఉద్యోగులతో గొడవలు. రిజర్వ్‌ బ్యాంకు నుంచి బ్యాంకులకు అందని డబ్బులు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఖాతాదారులకు రూ.5 వేలు ఇవ్వడానికే బ్యాంకులు ఇబ్బంది పడుతుంటే గురువారం నుంచి ఉద్యోగులకు వేతనాల నుంచి కనీసం రూఽ.10 వేల నగదైనా ఎలా చెల్లించాలని బ్యాంకర్లు కంగారు పడుతున్నారు.
     పెద్ద నోట్ల రద్దు అనంతరం 11వ తేదీ నుంచి బుధవారం దాకా జిల్లాలోని 14 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు,  వాటికి సంబంధించిన 418 శాఖల ద్వారా రూ.3వేల కోట్లకు పైగా డిపాజిట్లు చేరాయి. నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణ రూపంలో సుమారు రూ.700 కోట్లు చెల్లించారు. పోస్టాఫీసుల ద్వారా రూ.40 కోట్ల డిపాజిట్లు తీసుకుని,  ఈనెల 24వ తేదీ వరకు రూ.7 కోట్లు నగదు చెల్లించారు. పోస్టాఫీసుల్లో ఈ నెల 25వ తేదీ నుంచి విత్‌ డ్రాయల్స్‌ కూడా నిలిపివేశారు. జిల్లాకు కనీసం రూ.1000 కోట్ల నగదు పంపితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని బ్యాంకర్లు రిజర్వ్‌ బ్యాంకుకు నివేదించారు. పది రోజులు గడుస్తున్నా రిజర్వ్‌ బ్యాంకు నుంచి బ్యాంకులకు నామమాత్రపు నగదు మాత్రమే చేరుతోంది. దీంతో రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతాదారులకు వారానికి రూ.24 వేలు చెల్లించే పరిస్థితి లేదు. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంకు రూ.5 వేల వరకు మాత్రమే చెల్లింపు చేస్తామని పరిమితి విధించాయి. మిగిలిన బ్యాంకులైతే చెల్లింపులు లేవు అని బోర్డులు పెట్టేసి కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్‌ దారులు డబ్బుల కోసం బుధవారం బ్యాంకుల ముందు క్యూ కట్టారు. నెల్లూరు వేదాయపాలెం ఎస్‌బీఐతో పాటు మరిన్ని బ్యాంకులు ఖాతాదారులను అదుపు చేయడానికి కొందరు బ్యాంకు మేనేజర్లు పోలీసులను పిలిపించుకోవాల్సి వచ్చింది. రిజర్వ్‌ బ్యాంకు నుంచి డబ్బులు రాకపోతే తమనేం చేయమంటారని బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులను ప్రశ్నిస్తున్నారు.
    ఉద్యోగులకు రూ.10వేల నగదు అనుమానమే
    జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ.. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సుమారు లక్ష మంది ఉన్నారు. 10 వేల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. ప్రతి నెల ఉద్యోగులకు రూ.140 కోట్లు, పెన్షనర్లకు రూ.12 కోట్లు ప్రభుత్వాలు బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. పెద్దనోట్లు రద్దు చేయకముందు ఏటీఎంల నుంచి  రోజుకు రూ.40వేల నగదు తీసుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఏటీఎం కార్డుల ద్వారా తమకు అవసరమైన మేరకు నగదు తీసుకునేవారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ఉద్యోగులకు వారి జీతాల సొమ్ములో రూ.10వేలు మాత్రమే నగదు రూపంలో ఇస్తామని, మిగిలిన సొమ్ము ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా ఉపయోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ లెక్కన చూస్తే బ్యాంకులు ఉద్యోగులు రూ.14 కోట్లు, పెన్షనర్లకు రూ 1.20 కోట్లు దాకా చెల్లించాల్సి వుంది. బుధవారం నాటి నగదు నిల్వలను పరిశీలిస్తే  బ్యాంకులు ఉద్యోగులకు రూ.10 వేల నగదు ఇచ్చే పరిస్థితి లేదు. గురువారం ఉదయానికి రిజర్వ్‌ బ్యాంకు నుంచి నగదు చేరితే శుక్రవారం నుంచి ఈ సొమ్ము చెల్లించే అవకాశం ఉంటుందని, లేకుంటే తామేమీ చేయలేమని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. జీతం , పెన్షన్‌ మొత్తంలో రూ.10వేల నగదైనా అందకపోతే ఉద్యోగులు ఇంటి అద్దె, పాలు, గ్యాస్, కిరాణా కొట్లు, ఇతర చిల్లర ఖర్చులకు ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడి పోయే పరిస్థితి ఏర్పడనుంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల వద్ద బుధవారం ప్రజలు క్యూలు కట్టారు. డిపాజిట్ల నుంచి సొమ్ము తీసుకోవడానికి ఎగబడటంతో కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి.
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement