తిండికీ పైసల్లేవ్! | Sakshi
Sakshi News home page

తిండికీ పైసల్లేవ్!

Published Sat, Dec 3 2016 3:16 AM

తిండికీ పైసల్లేవ్! - Sakshi

  • నగదు కోసం రాష్ట్రవ్యాప్తంగా జనం అవస్థలు
  • బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు
  • వైద్యానికి సొమ్ము కోసం కొందరు
  • నిత్యావసరాలకు డబ్బు కోసం మరికొందరు
  • ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే
  • నానా ఇబ్బందులూ పడుతున్న వృద్ధులు
  • ఊరుకాని ఊరులో పర్యాటకుల అవస్థలు
  • చాలా బ్యాంకుల వద్ద ‘నో క్యాష్’ బోర్డులు
  • చాలా చోట్ల పనిచేయని ఏటీఎంలు
  • ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ప్రజానీకం  
  • సాక్షి, హైదరాబాద్
    ఒక్కొక్కరిది ఒక్కో దీనావస్థ.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. చేతిలో చిల్లిగవ్వలేక రోజు గడవడమే కష్టంగా ఉన్నది కొందరైతే.. వైద్యం, మందుల కొనుగోలు వంటి అత్యవసరాలకూ డబ్బుల్లేక అల్లాడుతున్నవారు మరి కొందరు. కష్టాలు తీరుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రకటనలు చేస్తుండగానే.. మరోవైపు పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోంది. కొద్దిరోజులు ఓపిక పడితే పరిస్థితి కాస్త కుదుటపడుతుందని ఇంతకాలం లేని సహనాన్ని తెచ్చిపెట్టుకున్న సాధారణ ప్రజలు... ఇక కరెన్సీ కష్టాలను మోసే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతుండటంతో జనం సహనం కోల్పోతున్నారు. బ్యాంకుల్లో సిబ్బందితో వాదోపవాదాలకు దిగుతున్నారు. బైఠాయింపులు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నారు.
     
    ఎక్కడ చూసినా ‘నో క్యాష్’
    రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులకు నగదు సరఫరా నామమాత్రంగా ఉండటంతో నగదు ఇవ్వలేకపోతున్నాయి. ఒక్కో బ్యాంకుకు రోజుకు కనీసం రూ.కోటి వరకు డిమాండ్ ఉండగా.. సరఫరా అవుతున్నది రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకే. దీంతో ఒక్కో ఖాతాదారు రోజుకు రూ.10 వేలు (వారంలో గరిష్టంగా రూ.24 వేలు) వరకు పొందవచ్చంటూ కేంద్రం చేసిన ప్రకటన ఎక్కడా అమలు కావడం లేదు. కొన్నిచోట్ల రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని బ్రాంచీలకు రెండుమూడు రోజులకోమారు మాత్రమే నగదు వస్తుండటంతో వాటి వద్ద ‘క్యాష్ లేదు’ అనే బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలదీ ఇదే పరిస్థితి. ఎప్పుడు నగదు లోడ్ చేస్తారో తెలియక ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు కాపలా కాయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పొద్దునే వచ్చి ఏటీఎంల ముందు నిలబడుతున్నారు. చాలా చోట్ల నగదు పెట్టిన కాసేపటికే అయిపోతోంది.
     
    అరుపులు.. కేకలు.. తిట్లు..
    నగదు దొరకని పరిస్థితుల్లో ఎవరిని నిలదీయాలో తెలియక జనం మండిపడుతున్నారు. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే మేమేం చేస్తామంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో.. జనం వారిపైనే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాదోపవాదాలకు దిగుతున్నారు. ‘నో క్యాష్’ నోటీసులను చూసి.. ‘పెద్దోళ్లకు దొడ్డిదారిన ఇచ్చి మాకు లేదని చెప్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయిస్తుండంతో ఇద్దరు ముగ్గురేసి కానిస్టేబుళ్లు పహారా కాయాల్సి వస్తోంది.
     
    చిరిగిన నోట్లు మళ్లీ జనంలోకి..
    చిరిగిన నోట్లు, అతుకులు, పెన్ను గీతలు పడిన నోట్లను వీలైనంత వరకు చలామణీలో ఉంచరు. అలాంటి నోట్ల స్థానంలో కొత్త నోట్లను తేవటం ఆర్బీఐ నిత్య కృత్యం. ఇందులో భాగంగా బ్యాంకులు నిత్యం పాత, చిరిగిన నోట్లను ఆర్బీఐకి పంపుతుంటాయి. కానీ అలాంటి చిరిగిన, అతుకులున్న పాత నోట్లు ఇప్పుడు మళ్లీ బ్యాంకుల ద్వారా చలామణీలోకి వస్తున్నాయి. నగదు సరఫరా కోసం డిమాండ్, కరెన్సీ ప్రింటింగ్ చాలినంత లేకపోవటంతో.. ఆర్బీఐ తన వద్ద ఉన్న చిరిగిన నోట్లను మళ్లీ బ్యాంకులకు పంపుతోంది. ఇటీవల స్టేట్‌బ్యాంకు చెస్ట్‌కు భారీగా ఇలాంటి నోట్లు వచ్చి పడ్డాయి. రెండు రోజుల క్రితం మెహిదీపట్నం సర్కిల్‌లోని ఓ బ్యాంకు మేనేజర్ అలాంటి రూ.30 లక్షల నోట్లను తెప్పించారు. నలుగురు సిబ్బందిని పెట్టి వాటిలో కాస్త మెరుగ్గా ఉన్న నోట్లను వేరుచేసి.. ఖాతాదారులకు పంపిణీ చేశారు. అలాగే చెస్ట్‌లో పోగుపడ్డ రూ.10 నాణేలను రూ.2 వేలకు ఓ మూటగా కట్టి ఖాతాదారులకు అందిస్తున్నారు. ‘కావాల్సినంత నగదు సరఫరా కానప్పుడు ఇంతకంటే చేసేదేముంది..’ అని ఆ బ్యాంకు మేనేజర్ పేర్కొన్నారు.
     
    నోట్ల ప్రింటింగ్ తప్పులతో సమస్యలు
    కొత్త రూ.500 నోట్లు వస్తున్నాయని, రెండు మూడు రోజుల్లో నగదు కష్టాలు తీరుతాయంటూ ఇటీవల ఆర్‌బీఐ ప్రకటనలు చేసింది. అందుకు అనుగుణంగానే దాదాపు రూ.500 కోట్ల వరకు రూ.500 కొత్త నోట్లు తెలంగాణకు వచ్చాయి. కానీ వాటి ముద్రణలో భారీ లోపాలున్నట్టు గుర్తించడంతో ఆ నోట్లన్నీ తిరుగుటపాలో వెనక్కు వెళ్లిపోయాయని వార్తలు వచ్చాయి. ఆ నోట్లు మార్కెట్‌లోకి వచ్చి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవి కావని బ్యాంకర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక తొలి విడత ప్రింటైన రూ.2 వేల నోట్లలోనూ కొన్ని తప్పులు దొర్లినా.. ఆర్బీఐ అలాగే మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెండో విడతలో ముద్రించిన రూ.2 వేల నోట్లు భారీ మొత్తంలో బ్యాంకులకు రానున్నాయి.
     

    ఈ వికలాంగ మహిళ పేరు సురేఖ. మెహిదీపట్నం సమీపంలోని ఇంద్రానగర్ నివాసి. ఆమె రెండు కాళ్లు చచ్చుబడటంతో చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటున్నారు. ఇటీవల చేతుల్లో తీవ్రంగా నొప్పి మొదలైంది. చేతిలో డబ్బులు లేక ఆసుపత్రికి వెళ్లలేకపోయారు. నాలుగు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు దొరకలేదు. శుక్రవారం కూడా బ్యాంకుకు వచ్చిన ఆమె ‘నగదు లేదు’ అన్న నోటీస్ చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన మూడు చక్రాల సైకిల్‌పై ఇలా తిరగలేకపోతున్నానని, చేతులు నొప్పితో ఇబ్బందిగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. ‘సాక్షి’ ప్రతినిధులు ఆమె గురించి వాకబు చేస్తుండటాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది.. అప్పటికప్పుడు ఆమెను లోనికి తీసుకెళ్లి రూ.4 వేల నగదు ఇచ్చి పంపారు.
     

    జనం ఉద్దెర పెడితే నే బతికేదెట్లా..?
    ఈయన పేరు మహబూబ్.. గోల్కొండలో ఉండే ఆయన గుడిమల్కాపూర్ మార్కెట్‌లో కూరగాయలు కొని తోపుడుబండిపై కాలనీల్లో తిరిగి అమ్ముతుంటారు. కొన్ని రోజులుగా చిల్లర లేదంటూ కొనుగోలుదారులు  ఉద్దెర పెడుతున్నారు. ఇలా రూ.ఆరు వేల వరకు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు డబ్బుల్లే మూడు రోజులపాటు వేరే పనులకు వెళ్లి.. రూ.వేయి సంపాదించుకున్నారు. మళ్లీ శుక్రవారం కూరగాయలు కొనుక్కుని అమ్మకానికి వచ్చారు. మళ్లీ ఉద్దెర పెట్టేందుకే ప్రజలు అడగటంతో దిక్కుతోచనిస్థితిలో పడిపోయాడు. ఇలాగైతే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు.

    నా కూతురు కాన్పు ఎట్లా?


    ఈయన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వరరావు. కార్వాన్‌కు చెందిన ఆయన కుమార్తె తొలి కాన్పునకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో సిజేరియన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దీంతో కనీసం రూ.25 వేలు సమకూర్చుకోవాలని నాలుగు రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం ఏకంగా 22 ఏటీఎంల చుట్టూ తిరగ్గా రూ.4 వేలు లభించాయి. శుక్రవారం తన ఖాతా నుంచి రూ.10 వేలు తీసుకుందామని గుడిమల్కాపూర్‌లోని ఆంధ్రా బ్యాంకుకు వచ్చారు. భారీగా జనం ఉండడంతో లోపలికి వెళ్లే అవకాశం లేకపోయింది. తోపులాటలో కళ్లు తిరిగి కిందపడిపోవటంతో చేసేది లేక ఇంటిముఖం పట్టారు. తన ఖాతాలో రూ.2 లక్షల నగదు ఉందని, కనీసం రూ.10వేలు ఇవ్వడం లేదేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఆరు బయటే వృద్ధుల ఎదురుచూపు


    ఈ దంపతులు ధర్మరాజు, సూర్యకాంతమ్మ. వారం రోజులుగా చేతిలో డబ్బుల్లేవు. ధర్మరాజు ఉబ్బసంతో బాధపడుతుండడంతో వైద్యం కోసం వెళ్లాల్సి ఉంది. ఆయన ఖాతానుంచి రూ.4 వేల పింఛన్ డబ్బులు, ఆమె ఖాతా నుంచి రూ.4 వేల నగదు కలిపి రూ.8 వేలు పొందాలని బ్యాంకుకు వచ్చారు. కానీ అప్పటికే బ్యాంకు ముందు జనం భారీగా గుమిగూడి ఉండడంతో.. సిబ్బంది లేనికి అనుమతించలేదు. దీంతో బ్యాంకు అరుగుపై కూర్చుని సాయం కోసం ఎదురుచూశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో సాయంత్రం ఇంటిముఖం పట్టారు.

    హైదరాబాద్‌లో కేరళ యువకుల తిప్పలు
    కేరళలోని అలప్పీకి చెందిన యువ పర్యాటకుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. వెంట తెచ్చుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. కేరళకు తిరిగి వెళ్దామంటే రైలు టికెట్ కూడా కొనే పరిస్థితి లేదు. చేతిలో డెబిట్ కార్డున్నా టికెట్ కొనడం కష్టంగా మారింది. ఓ రైల్వే స్టేషన్‌కు వెళ్తే కార్డు అంగీకరించబోమని అక్కడి సిబ్బంది చెప్పారని వారు వాపోయారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో కార్డు అనుమతిస్తున్నా వారికి తెలియదు. శుక్రవారం చేతిలో రూ.80 మాత్రమే ఉండటంతో స్నేహితులంతా బిస్కట్లు కొనుక్కుని తిన్నారు. ఉదయం 8 గంటలకు మెహిదీపట్నంలోని స్టేట్‌బ్యాంకు ఏటీఎం ముందు నిలబడ్డారు. సాయంత్రం వరకు డబ్బు రాకపోవడంతో తమకేమైనా సాయం చేయండంటూ అందరినీ అడుగుతూ కనిపించారు. వారికి హిందీ, తెలుగు రాకపోవటంతో స్థానికులకు వారి గోడు అర్థం కాలేదు.

    వృద్ధుడిని బలిగొన్న చిల్లర..
    బ్యాంకుల ఎదుట క్యూలైన్లు రంగారెడ్డి జిల్లా కొందుర్గులో మీరాపురం సామేల్ (68) అనే వృద్ధుడి ప్రాణాలు బలిగొన్నారుు. రెండు రోజులకింద ఆసరా పింఛన్ డబ్బుల కోసం వెళ్లిన ఆయన... గంటల తరబడి నిల్చోవడంతో క్యూలోనే సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

     
    ఈయన పేరు ఖాజా మొహినుద్దీన్. కొద్ది నెలల క్రితం విద్యుదాఘాతానికి గురికావడంతో చేతులు, కాళ్లను తొలగించి  కృత్రిమ అవయవాలు అమర్చారు. ఇవి దెబ్బతినడంతో ఆసుపత్రికి వెళ్తే.. కొత్తవి అమర్చు కోవాలని, రూ.25 వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో 3 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం విజయనగర్ కాలనీలోని బ్యాంకుకు వచ్చిన ఆయన.. క్యూను చూసి కంగుతిన్నారు. అతని దీనావస్థను చూసిన మేనేజర్ రూ. 4 వేల నగదు ఇప్పించారు. ఇలా ఎన్నిరోజులు గడిస్తే రూ.25 వేలు జమకావాలంటూ మొహినుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
     
     ఈ వృద్ధురాలి పేరు ఇందిర. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈమెకు విశాఖపట్నంలో బ్యాంకు ఖాతా ఉంది. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. 3 రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదు. ఆమె వంతు వచ్చేసరికే డబ్బు అయిపోతుండడంతో శుక్రవారం ఏటీఎం తెరవకముందే వచ్చి ఇలా కూర్చున్నారు. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఆ ఏటీఎంకు నగదు రాలేదు. డబ్బుకోసం ఇబ్బందిగా ఉందంటూ దీనంగా చెబుతున్నా.. జాలిపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత.

Advertisement

తప్పక చదవండి

Advertisement