నో కోడ్‌.. వెరీ బ్యాడ్‌! | Sakshi
Sakshi News home page

నో కోడ్‌.. వెరీ బ్యాడ్‌!

Published Sun, Jul 17 2016 9:49 PM

నో కోడ్‌.. వెరీ బ్యాడ్‌!

నాలుగు దశాబ్దాలుగా ఏఎన్‌యూకి సొంతకోడ్‌ లేని వైనం
ఏయూ నుంచి తీసుకున్న దత్తత కోడ్‌పైనే ఆధారం
కీలక అంశంపై దృష్టి సారించని ఉన్నతాధికారులు
ఏఎన్‌యూ: యూనివర్సిటీ వ్యవస్థలో కోడ్‌ అత్యంత కీలకం. యూనివర్సిటీకి సంబంధించిన పరిపాలన, కార్యనిర్వహణ, నియమ నిబంధనలు, ఉద్యోగుల విధులు, పరీక్షలు, అవినీతి వ్యవహారాలపై చర్యలు తీసుకోవటం, సిబ్బంది పదోన్నతులు, అధికారుల అధికారాల పరిధి, వ్యవస్థాపరమైన కార్యకలాపాలు, ఆర్థిక పరమైన అంశాలు కొనసాగింపు, రోజువారీ వేతన ఉద్యోగి నుంచి వీసీ స్థాయి ఉన్నతాధికారి వరకు ఎవరి విధులు, అధికారాలు ఏంటి, బీఓఎస్‌ చైర్మన్ల పనితీరు, అకడమిక్‌ సెనేట్, పాలకమండలి బాధ్యతలతో కూడిన పూర్తి నియమాలు, నిబంధనలు కోడ్‌లో పొందుపరచి ఉంటాయి. యూనివర్సిటీ సమగ్ర వ్యవస్థకు కోడ్‌ మూల స్తంభం లాంటిది. అలాంటి అత్యంత కీలకమైన కోడ్‌ను నేటికీ సొంతగా రూపొందించుకోలేని దుస్థితిలో ఏఎన్‌యూ ఉంది. 
ఏయూ నుంచి ఏఎన్‌యూకి కోడ్‌ దత్తత..
ఆంధ్రా యూనివర్సిటీకి పీజీ సెంటర్‌గా కొనసాగిన విద్యా సంస్థ 1976లో నాగార్జున యూనివర్సిటీగా ఏర్పడింది. ఏఎన్‌యూ ప్రారంభంలో మాత సంస్థ అయిన ఏయూ ( ఆంధ్రా యూనివర్సిటీ) కోడ్‌ను అప్పటి పాలకులు ఏఎన్‌యూకి అడాప్ట్‌ (దత్తత) చేసుకున్నారు. ఆ కోడ్‌ ఆధారంగానే అన్ని అంశాలను కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ ప్రారంభంలో వ్యవస్థాపరమైన అంశాల కోసం దత్తత చేసుకున్న కోడ్‌పైనే నాలుగు దశాబ్ధాలుగా ఏఎన్‌యూ అధార ‡పడుతోంది. 
లోపాలను అవకాశంగా వాడుకుంటున్న వైనం..
ఏఎన్‌యూకి సొంత కోడ్‌ లేకపోవటంతో ఏయూ నుంచి దత్తత తీసుకున్న కోడ్‌ను ఏఎన్‌యూలో పలువురు మేధావులు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. యూనివర్సిటీలో ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వెలుగులోకి వచ్చిన స్కామ్‌లు, కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు, వ్యవస్థాపరమైన లోపాలపై ఏం చర్యలు తీసుకోవాలన్నా స్పష్టమైన నిర్దేశాలు లేకుండా పోయాయి. సిబ్బంది నియామకం, వారి పదోన్నతులు తదితర అంశాలపై కోడ్‌ అమలులో ఏఎన్‌యూ, ఏయూల మధ్య వ్యత్యాసం ఉంది. సిబ్బందికి ఏయూలో మూడేళ్లకోసారి పదోన్నతులు కల్పిస్తుండగా ఆ కోడ్‌ అనుసంధానంగా ఉన్న ఏఎన్‌యూలో ఒకటి, రెండేళ్లకే పదోన్నతులు కల్పిస్తున్నారు. 
బుట్టదాఖలైన ఏఎన్‌యూ కోడ్‌..
 ఏఎన్‌యూకి సొంతకోడ్‌ను రూపొందించేందుకు యూనివర్సిటీ పాలకులు గతంలో నాంది పలికారు. ఏఎన్‌యూ మాజీ రిజిస్ట్రార్‌లైన ఆచార్య రంగయ్య, రావెల సాంబశివరావు తదితరులతో యూనివర్సిటీకి కోడ్‌ను రూపొందించి అప్పట్లో ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పరిశీలన అనంతరం కొన్ని అంశాల మార్పు కోసం మళ్లీ ఏఎన్‌యూకి పంపారు. ఏఎన్‌యూ మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎంవీఎన్‌ శర్మ, మాజీ ఫైనాన్స్‌ అధికారి జగన్నాధరావు, అప్పటి సీడీసీ డీన్‌ ఆచార్య జీవీ చలంతో మళ్లీ ఏఎన్‌యూ కోడ్‌ రూపకల్పన చేయించారు. ఈ కమిటీ సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆరు అధ్యాయాలు, 32 స్టాట్యూట్స్‌తో 2014లో ఏఎన్‌యూకి పూర్తి స్థాయి కోడ్‌ రూపొందించింది. అప్పటి నుంచి దానిని పరిశీలించి ఏఎన్‌యూ పాలకమండలిలో ప్రవేశ పెట్టి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ విషయాన్ని బుట్టదాఖలు చేశారు. 

 

Advertisement
Advertisement