కాపులకు స్వేచ్ఛ లేదా? | Sakshi
Sakshi News home page

కాపులకు స్వేచ్ఛ లేదా?

Published Sun, Dec 13 2015 5:00 AM

కాపులకు స్వేచ్ఛ లేదా? - Sakshi

చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ టీడీపీ నాయకులు తరచుగా సభలు, సమావేశాల్లో ప్రకటిస్తున్నారని, అరుుతే ఇలాంటి కొంగజపాలు మాని ఎన్నికల హామీలను అమల్లో పెట్టాలని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. హామీల అమలు గురించి అడిగిన వారిపై దాడులు చేయించడాన్ని తప్పుపట్టారు. ‘ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? లేక ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ విధించారా?’ అని ప్రశ్నిస్తూ సీఎంకు రాసిన లేఖ ప్రతులను శనివారం మీడియాకు విడుదల చేశారు. ‘ఈ రాష్ట్రంలో కాపులు మీటింగ్‌లు పెట్టుకోకూడదా? ఏ ఊరిలో చూసినా మీ ముఖంతో ఉన్న ఫ్లెక్సీలే ఉండాలా? మీ ఫ్లెక్సీలపై మా జాతి దాడి చేయడానికి సంస్కారం అడ్డువస్తోంది.

మీరు పాదయాత్రలో, 2014 ఎన్నికల సమయంలో బలిజ, ఒంటరి, తెలగ, కాపు జాతి ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని, సంవత్సరానికి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. వాటి గురించి అడుతుంటే దాడులు చేయిస్తున్నారు. మీరిచ్చిన హామీల గురించి రోడ్డుపైకి వచ్చి అడగకూడదా? పట్టిసీమకు, పప్పుబెల్లాలకు, రాజధాని వంకతో యువరాజా వారి పట్టాభిషేకం కోసం, మీరు విదేశాల్లో తిరగడానికి కోట్ల ప్రజాధనాన్ని అడ్డూ అదుపు లేకుండా ఖర్చు చేయట్లేదా? కాపు జాతికి ఇచ్చిన హామీల అమలుకు మాత్రం బిచ్చం వేసినట్లుగా రూ.50 కోట్లు, రూ.100 కోట్లు ఇచ్చి సరిపెడతారా?

ఎందుకు మా జాతిని చులకనగా చూస్తున్నారు? మీరు గద్దె ఎక్కడానికి మాత్రం మా జాతి ఓట్లు కావాలా? మీరిచ్చిన హామీలే అమలు చేయమంటే అబద్ధాలతో ఎదురుదాడి చేయించడం సమంజసమా? మా మీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతామనుకుంటున్నారేమో! బంతిని ఎంతగట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంది. మా జాతి తిరగబడటానికి భయపడదు. మీ తీరు మార్చుకోండి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం...’ అని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement