అధికారులే చంపేశారు! | Sakshi
Sakshi News home page

అధికారులే చంపేశారు!

Published Mon, Oct 10 2016 12:27 AM

అధికారులే చంపేశారు! - Sakshi

– కిరణ్‌ ఆత్మహత్యకు కలెక్టర్, రుద్రవరం తహసీల్దార్‌ బాధ్యత వహించాలి
– కలెక్టరేట్‌ ఎదుట మృతుడి భార్య, ఆలమూరు గ్రామస్తులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
– బాధితుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలి
   
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రుద్రవరం మండలం ఆలమూరు గ్రామ దళిత రైతు కిరణ్‌ను రెవెన్యూ అధికారులే హత్య చేశారని దళిత సంఘాలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని కిరణ్‌ సాగు చేసుకుంటున్నాడు. పట్టా కోసం తిరుగుతున్నా అధికారులు కరుణించలేదు. నాలుగురోజుల  క్రితం జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ను ఆశ్రయించడానికి వస్తే ఆయన పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11 గంటలకు కిరణ్‌ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు ఆల్మూరు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా కులవివక్ష వ్యతేరేక పోరాటసమితి జిల్లా కార్యదర్శి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ..  రుద్రవరం తహసీల్దార్‌ మాల కొండయ్య గ్రామంలో అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ కిరణ్‌ను పట్టా ఇవ్వకపోవడంతో ప్రాణం తీసుకున్నాడన్నారు. అతని ఆత్మహత్యకు తహసీల్దార్‌తోపాటు కలెక్టర్‌ బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. మృతుడికి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  
 
రుద్రవరం తహశీల్దార్‌ సస్పెండ్‌కు డిమాండ్‌ 
మృతుడు కిరణ్‌ భార్య విజయ, గ్రామస్తులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. కర్నూలు, ఆళ్లగడ్డ డీఎస్పీలు రమణామూర్తి, ఈశ్వరరెడ్డి మొదట ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు. కిరణ్‌పై దాడి చేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేశామని, ఇప్పటికే పదకొండు మందిని అరెస్టు చేశామన్నారు. రుద్రవరం తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేస్తేనే ధర్నాను విరమిస్తామని వారు పోలీసులకు స్పష్టం చేశారు. వెంటనే కలెక్టర్‌ వచ్చి రుద్రవరం తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేస్తానని హామీ ఇవ్వాలని కోరారు. అయితే కలెక్టర్‌ బదులు డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌ తహసీల్దార్‌పై నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌ను విచారణకు ఆదేశించామని, రెండు మూడు రోజుల్లో నివేదిక తెప్పించుకొని చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష రూపాయలను ఆదివారం సాయంత్రమే అందజేయనున్నట్లు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఎసీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఆనంద్, టీఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, మాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement
Advertisement