పున్నగూడకు నిలిచిన రాకపోకలు | Sakshi
Sakshi News home page

పున్నగూడకు నిలిచిన రాకపోకలు

Published Mon, May 1 2017 10:55 PM

పున్నగూడకు నిలిచిన రాకపోకలు

నార్నూర్‌: గాదిగూడ మండంలోని సాంగ్వి గ్రామం నుంచి పున్నాగూడకు వెళ్లే రోడ్డుపై ఉన్న వంతెన జూలై నెలలో కురిసిన భారీ వర్షానికి వంతెన పైకప్పు వరద తాకిడికి లేచిపోయింది. దీంతో పున్నగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ చిన్న అవసరం పడిన లోకారి–కే లేదా నార్నూర్‌ మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. వాగుపై ఉన్న వంతెన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు ఉన్నారు.

ఈ వంతెనపై నుంచి సాంగ్వి, భీంజీగూడ గ్రామస్తులు సైతం వారి వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. పొలాలకు ఎండ్ల బండి సైతం వెళ్లలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని రైతులు దిగులు చెందుతున్నారు. వంతెనకు మరమ్మతులు చేపట్టాలని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఇప్పటి వరకు స్పందన లేదని గ్రామ సర్పంచ్‌ మేస్రం లచ్చు, గిరిజనులు అంటున్నారు.

వంతెన తెగి నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ సమస్య పట్టడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు తెలిపిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన మరమ్మతు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Advertisement
Advertisement