ధరల పెరుగుదలపై 2న ఆందోళనలు | Sakshi
Sakshi News home page

ధరల పెరుగుదలపై 2న ఆందోళనలు

Published Sat, Oct 31 2015 1:13 AM

ధరల పెరుగుదలపై 2న ఆందోళనలు - Sakshi

♦ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై పార్టీ నేతలతో జగన్ సమీక్ష
♦ తహసీల్దార్ కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయం
♦ రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనాలని పిలుపు
♦ కుటుంబ ఖర్చు 60శాతం పెరగడం 17 నెలల టీడీపీ పాలన పాపమే
♦ దీనికితోడు ఆర్టీసీ చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు యోచన
♦ ఐదేళ్లపాటు నిత్యావసర ధరలను పెరగనీయమని హామీ ఇచ్చారు
♦ పట్టిసీమను నమ్మి కృష్ణా డెల్టాలో నాట్లు వేస్తే ఎండిపోతున్నాయి
♦ పంటలు ఎండిన ప్రాంతాల్లో 3,4 తేదీల్లో పార్టీ నేతల పర్యటన: ఉమ్మారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: కందిపప్పుతో సహా అన్ని రకాల పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంపై రాజకీయ పార్టీలకు అతీతంగా వినియోగదారులతో కలిసి నవంబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అలాగే కృష్ణా డెల్టాలో ఎండుతున్న పంటల పరిస్థితిపై అధ్యయనం చేయడానికి పార్టీ నేతల బృందం 3, 4 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించనుంది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తీరు తెన్నులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన  నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమగ్రంగా చర్చించారు.

పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారధి, జ్యోతుల నెహ్రూ, మర్రి రాజశేఖర్,ఆళ్ల రామకృష్ణారెడ్డి, కత్తెర సురేష్, ఎల్. అప్పిరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు పార్టీ నేతలతో కలిసి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కేంద్రాల వద్ద నవంబర్ రెండో తేదీన చేపట్టే ధర్నాల్లో ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐదారుగురు సభ్యులు ఉండే కుటుంబ నెలవారీ సగటు ఖర్చు 60 శాతం పెరిగేంతగా ధరలు పెరగడం గత 17 నెలల తెలుగుదేశం పార్టీ పాలన పాపమేనని దుయ్యబట్టారు.

దీనికితోడు ప్రభుత్వం ఇప్పటికే పది శాతం ఆర్టీసీ ఛార్జీలను పెంచిందని, కరెంట్ ఛార్జీలను కూడా పెంచాలని ఆలోచన చేస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు  కందిపప్పు కిలో ధర రూ. 58 రూపాయలుండగా... ఇప్పుడు మూడురెట్లు పెరిగి రూ. 210కు చేరితే కిలో రూ. 140కి అమ్మడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపట్టారు. ఐదేళ్లపాటు నిత్యావసర ధరలను పెరగనీయకుండా అదుపులో ఉంచుతామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కందిపప్పును కిలో రూ. 58 కే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

 ధరలు పెరుగుతున్నా రైతుకు లాభం రావడంలేదు
 నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ ఆయా పంటలు పండించే రైతుకు లాభం దక్కడం లేదని ఉమ్మారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రూ. 45- 50 ఉన్నప్పటికీ.. రైతు దగ్గర ధాన్యం క్వింటాలు రూ. 1250కి మించి కొనుగోలు చేయడం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 1640 కూడా దక్కడం లేదన్నారు. మొన్నటివరకు రూ. 80  పలికిన కిలో ఉల్లిగడ్డలు ఇప్పడు రూ. 30-40కి తగ్గినా రైతుకు క్వింటా ఉల్లిగడ్డలు రూ. 300కి మించి దక్కడం లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు.

 పట్టిసీమను నమ్మితే...
 కృష్ణా డెల్టాలో ఈ ఏడాది తొలుత 13 లక్షల ఎకరాల్లో కేవలం 8 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారని.. పట్టిసీమ ప్రాజెక్టు నీరు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పాక సెప్టెంబరు నెలలో మరో రెండు లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ భూములకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. కృష్ణా డెల్టాలో ఎండుతున్న పంటల పరిస్థితిపై అధ్యయనం చేయడానికి పార్టీ నేతల బృందం 3, 4 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించనుందని తెలిపారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాక మనకు నీటి విడుదల కాకుండా దామాషా పద్ధతిన నీటి వాటా కోరాలని గత శాసనమండలి సమావేశాల్లో తాను సీఎం దృష్టికి తీసుకొచ్చానని, ఇప్పుడు ఆ డిమాండ్‌ను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని తెలిపారు. దామాషా పద్ధతిన నీటి వాటా రావాలంటే కొత్త కృష్ణా ట్రిబున్యల్ ఏర్పాటు కావాల్సి ఉంటుందని ఉమ్మారెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement