ఏపీకి మరో‘సారీ’ | Sakshi
Sakshi News home page

ఏపీకి మరో‘సారీ’

Published Tue, Mar 1 2016 3:36 AM

ఏపీకి మరో‘సారీ’ - Sakshi

ఫలించని ప్రత్యేక హోదా కల..  ప్రత్యేక ప్యాకేజీ ఊసూ లేదు
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో అష్టకష్టాలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. రాష్ట్ర విభజన హామీల సాధనలో, వివిధ పథకాలకు నిధులు రాబట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సోమవారం నాటి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి భరోసా దక్కలేదు. రెవెన్యూ లోటు భర్తీ ఊసే లేదు. వెనుకబడిన జిల్లాలకు, కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల విస్తరణ ఊసు కూడా కేంద్ర బడ్జెట్‌లో లేదు.
 
  కేబీకే, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఏదీ?
► వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ.. కోరాపుట్-బొలాంగిర్-కలహండి (కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని ఆనాటి ప్రధాని చెప్పారు. కానీ కేంద్రం ఏటా జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేస్తోంది.
► ఇక ఏపీలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాగే ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధానాసుపత్రిని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే ఆయా సంస్థలకు కేంద్రం నామమాత్ర ంగానే నిధులు విదిల్చింది.
 
  రాజధానికి రిక్తహస్తం
  కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధుల కేటాయింపులు పూర్తిగా కరువయ్యాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి తదితర అవసరమైన మౌలిక వసతులతో కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ సారి బడ్జెట్‌లో దీని ఊసే లేదు. తొలిసారి 2014-15లో కేవలం రూ.1,000 కోట్ల మేర ప్రత్యేక సాయం ప్రకటించినా.. ఆ తరువాతి సంవత్సరం గానీ, ఇప్పుడు గానీ ఈ పద్దు కింద ఒక్క పైసా కేటాయించకపోవడం గమనార్హం.
 
 పోలవరం పూర్తయ్యేదెప్పుడు?
 పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మళ్లీ కేవలం రూ. 100 కోట్లు కేటాయించింది. విభజన చట్టంలోని సెక్షన్ 90 పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయంతోపాటు పునరావాసానికి కూడా కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఆ చట్టం చెబుతోంది. రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలి. అయితే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం పూర్తి ఉదాసీనత కనబరుస్తోంది.  2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు కేటాయిస్తే.. 2015-16 బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు విదిలించారు. ఇక ఈ ఏడాది కూడా మరో రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారు.

  విభజన చట్టంలో పొందుపరిచిన దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, వైజాగ్-చె న్నై ఇండస్ట్రియల్ కారిడార్, కడపలో స్టీలు ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాల అభివృద్ధి వంటి ప్రధాన హామీలను ఈ బడ్జెట్ విస్మరించింది.
  విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పొందుపరచగా.. తాజాగా విజయవాడ మెట్రోకు రూ.106 కోట్లు కేటాయించింది. విశాఖ మెట్రోకు రూ.3 లక్షలే కేటాయించడం ఆశ్చర్యపరిచింది.
 
 కేంద్ర పన్నుల్లో  ఏపీ వాటా.. రూ.24,637.36 కోట్ల
 2016-17కు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 24,637.36 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్రాలకు పంపిణీ చేసే మొత్తం పన్నుల్లో (42 శాతం) 4.305 శాతంగా ఉంది. కార్పొరేషన్ పన్ను రూ. 7,729.34 కోట్లు, ఆదాయ పన్ను రూ. 5,990.02 కోట్లు, కస్టమ్స్ పన్ను రూ. 3,851.29 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 3,077.29 కోట్లు, సేవా పన్ను రూ. 3,889.86 కోట్లుగా ఉంది. గత ఏడాది (రూ. 21,893.79 కోట్లు)తో పోల్చితే ఇది సుమారు రూ.2,800 కోట్లు అధికం.
 
 చిత్రమైన మినహాయింపులు..
 వింత వింత పన్నులే కాదు, అంతకంటే విచిత్రమైన మినహాయింపులూ ఉన్నాయి... అమెరికాలో ఒక గ్యాస్‌స్టేషన్ యజమాని తన కస్టమర్లకు ఉచితంగా బీరు పోసేవాడు. ఉచితంగా పోసే బీరుకు అయ్యే ఖర్చును అనుమతించదగ్గ వ్యాపార వ్యయంగా పరిగణించి, అక్కడి అధికారులు అతడి బీరు ఖర్చును పన్ను నుంచి మినహాయించారు.
 -సాక్షి సెంట్రల్ డెస్క్

Advertisement
Advertisement