శుభ కార్యానికి వెళ్లి.. | Sakshi
Sakshi News home page

శుభ కార్యానికి వెళ్లి..

Published Wed, Oct 19 2016 11:26 PM

శుభ కార్యానికి వెళ్లి.. - Sakshi

= భార్యా పిల్లలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు
= జూరాల కుడి కాలువలో కొట్టుకుపోయిన లోకో పైలట్‌
= నాలుగు కిలోమీటర్ల దూరంలో మృతదేహం గుర్తింపు
= గుంతకల్లులో విషాదం


గుంతకల్లు : శుభ కార్యానికి వెళ్లిన ఓ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాలువలో కొట్టుకుపోతున్న భార్యా పిల్లలను కాపాడే ప్రయత్నంలో ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుంతకల్లులోని రైల్వే శాఖలో కోలో పైలట్‌గా పని చేసే విజయ్‌(36) స్థానిక డీఆర్‌ఎం కార్యాలయ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయ వద్ద రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. తెలంగాణలోని గద్వాల్‌లో ఉంటున్న తన సోదరి హెప్సిబారాణి ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యా పిల్లలతో కలసి మంగళవారం వెళ్లారు. అక్కడికి సమీపంలోని జూరాల కుడికాలువ వద్ద విజయ్‌ భార్యాపిల్లలతో కలసి ఈతకు వెళ్లారు. కాలువలో నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న భార్యాపిల్లలను రక్షించారు.

దురదృష్టవశాత్తు అతను మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. కాలువలో రాత్రంతా విజయ్‌ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, గద్వాల్‌ పోలీసులు గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం 11 గంటలకు అక్కడికి సమీపంలోని 4 కి.మీ. దూరంలో విజయ్‌ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరుమన్నారు. విజయ్‌ మృతదేహానికి గద్వాల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గుంతకల్లుకు తీసుకువచ్చారు. లోకో పైలెట్‌ విజయ్‌ మృతి విషయం తెలిసి గుంతకల్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనాథ్‌గౌడ్, స్నేహితులు, సహచర ఉద్యోగులు సంతాపం తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement