కొనసాగుతున్న మరణమదంగం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న మరణమదంగం

Published Thu, Sep 22 2016 11:19 PM

పువ్వల నితిన్‌

ఏజెన్సీలో మరో చిన్నారి కన్నుమూత
పదికి చేరిన విద్యార్థుల మరణాలు 
 
పార్వతీపురం : పార్వతీపురం మన్యంలో మరో గిరి పసిమొగ్గ రాలింది. గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పువ్వుల నితిన్‌(9) అనారోగ్యంతో గురువారం కన్నుమూశాడు. మన్యంలో నిత్యం ఏదో ఒకచోట  గిరిజన విద్యార్థులు మరణిస్తూనే ఉన్నారు. వీటిని అరికట్టాల్సిన మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. తప్ప ఆచరణలో అమలు చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆరేడు మంది విద్యార్థులు మతి చెందారని చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఆ సంఖ్య పదికి చేరిందని గిరిజన సంఘాలు చెబుతున్నాయి.
 
 
 జ్వరంతో బాధపడుతూ..
గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పువ్వల నితిన్‌ జ్వరంతో బాధపడుతూ ఐదు రోజుల కిందట స్వగ్రామమైన మండలంలోని వనకాబడి పంచాయతీ కుసు గ్రామానికి వచ్చాడు. వెంటనే నాటువైద్యం చేయించామని బాలుడి తండ్రి దోమన్న తెలిపారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారి చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు.  ఈ విషయమై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జి. నాగభూషణరావు మాట్లాడుతూ, పువ్వల నితిన్‌ నెక్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే చనిపోయాడన్నారు.  ఇప్పటికే గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మత్యువాత పడ్డారు. 
 
 
 పది మంది...
 ఈ ఏడాది రోగాల సీజన్‌ ఆరంభమైన నాటి నుండి నేటి వరకు 10 మంది విద్యార్థులు మత్యువాత పడినట్లు గిరిజన, విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. జూలై ఒకటిన గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పత్తిక నందిని, ఆగస్టు 13న  రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన తిమ్మక వనజాక్షి, ఆగష్టు 14న గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన బిడ్డిక రామారావు, ఆగష్టు 24న పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన బిడ్డక హైమావతి,  ఆగస్టు 26న భద్రగిరి ఏపీఆర్‌ గురుకుల బాలురు జూనియర్‌ కళాశాలకు చెందిన ఎప్పరిక పవన్‌ కుమార్, తదితర పదిమంది మతి చెందారు.  
 
 
 
 
 
 

Advertisement
Advertisement