ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను

Published Sat, Dec 31 2016 10:36 PM

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి రూ. 123 కోట్ల పన్ను - Sakshi

నిజామాబాద్‌ నాగారం : నిజామాబాద్‌ డివిజన్‌ సర్కిల్‌ పరిధి సంగారెడ్డి జిల్లా యెద్దు మైలారం గ్రామంలో గల ఆర్డినెన్సు ఫ్యాక్టరీ నుంచి 123 కోట్ల 70 లక్షల 64వేల 553 పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖాజానాకు జమ చేసినట్లు వాణిజ్యపన్నుల శాఖ ఇంటిలిజెన్సు అసిస్టెంట్‌ కమీషనర్‌ లక్ష్మయ్య తెలిపారు. దేశ రక్షణకు యుద్ధ ట్యాంకులు తయారు చేసి సరఫరా చేస్తున్న ఆర్డినెన్స్‌ కంపెనీ పన్నులు చెల్లించకపోవడంతో ఇంటిలిజెన్స్‌ బృందం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో సుమారు 49 ఆర్డినెన్సు కంపెనీలు ఉన్నాయని, ఎక్కడ కూడా ఈ కంపెనీలు పన్నులు చెల్లించ లేదన్నారు. నిజామాబాద్‌ డివిజన్‌లో ఇదే మొదటి సారన్నారు.  వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు మదింపు చేసి టాక్స్‌లు వసూలు చేస్తుంటామన్నారు.

 యెద్దు మైలారంలోని ఆర్డినెన్స్‌ కంపెనీ గతంలో కేవలం కొన్ని వ్యాపార లావాదేవీలపైన మాత్రమే పన్ను చెల్లించేందన్నారు. ముఖ్యంగా కంపెనీ తయారు చేసి దేశరక్షణకు సరఫరా చేస్తున్న యుద్ధ ట్యాంకర్‌ వాహనాలపైన మినహాయింపులు పొందుతూ టాక్స్‌ చెల్లించడం లేదని ఇంటలి జెన్స్‌ బృందం పరిశీలనలో తేలిందన్నారు. ఆ ట్యాంకర్ల సరఫరాపై పన్నులు విధించినట్లు తెలిపారు. మొదటి విడత రూ. మార్చి 17న రూ. 25 కోట్ల 85 లక్షల 34 వేల 185 వసూలు చేసినట్లు తెలిపారు. రెండవ విడతలో సెప్టెంబర్‌ 29న రూ.42 కోట్ల 55 లక్షల 11వేల 235 వసూలు చేశామన్నారు.   శుక్రవారం నాడు రూ. 55 కోట్ల 35 లక్షల 19వేల 133 వసూలు చేసినట్లు వివరించారు.  ఇప్పటి వరకు మొత్తం రూ. 123 కోట్ల 70 లక్షల 64వేల 553 వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తెలిపారు. కేవలం ఆడిట్‌ ద్వారా పన్నులు అత్యధికంగా వసూలు చేసిన ఘనత నిజామాబాద్‌ వాణిణ్య పన్నుల శాఖ డివిజన్‌కు దక్కిందన్నారు.

రాష్ట్ర చరిత్రలోనే ఒకే వ్యాపార సంస్థ ద్వారా పన్నులు వసూలు చేయడం ఇంటిలిజెన్స్‌ వింగ్‌ ద్వారానే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా వివిధ వ్యాపార సంస్థలు తమ అమ్మకాలపై రాష్ట్రంలో వ్యాట్, సీఎస్‌టీ ట్యాక్సులు వసూలు చేస్తాయన్నారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 8 లార్జ్‌ యూనిట్‌ సర్కిల్‌లు ఉన్నాయని, వీటిలో అధిక పన్నులు చెల్లించే  41 మంది డీలర్లు అయిన ప్రముఖ వ్యాపార సంస్థలు ఎంఆర్‌ఎఫ్, బీహెచ్‌ఈఎల్, ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తదితర కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటి కమిషనర్‌ జి లావణ్య, గతంలో ఉన్న డీసీ శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో ఇది సాధించామన్నారు. సమావేశంలో ఏసీటీఓలు జి గంగాధర్, పోతనకర్‌ లక్ష్మీనారాయణ, ఎస్‌ జయంత్‌నాద్, ఆధిత్యకుమార్, జూనియర్‌అసిస్టెంట్‌ బి భారతి, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement