పద్యనాటక సప్తాహం.. ఘనంగా ప్రారంభం | Sakshi
Sakshi News home page

పద్యనాటక సప్తాహం.. ఘనంగా ప్రారంభం

Published Sat, Sep 3 2016 12:23 AM

పద్యనాటక సప్తాహం.. ఘనంగా ప్రారంభం

  • అలరించిన రాష్ట్రస్థాయి నాటక పోటీలు 
  • నేరెళ్ల వేణుమాధవ్‌కు సన్మానం
  • హన్మకొండ కల్చరల్‌ : తెలంగాణ రాష్ట్రభాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం శుక్రవారం  హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాదవ్‌ కళాప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ నేరెళ్ల వేణుమాదవ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర మేయర్‌ నన్నపనేని నరేందర్‌ మాట్లాడుతూ.. పందిళ్ల శేఖర్‌బాబు పద్యనాటకమంటే మమకారంతో ఎన్నో త్యాగాలు చేశారని, అభినవ శ్రీకృష్ణుడిగా చిరకాల కీర్తి సంపాదించుకున్నారని  అన్నారు. రాష్ట్రస్థాయి ఉత్సవాలు వరంగల్‌లో నిర్వహిస్తున్నారని తెలియగానే రూ.ఐదు లక్షలతో కళాప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
     
    ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తా చాటి గరుడ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న గొప్ప కళాకారుడు శేఖర్‌బాబు అని కొనియాడారు. పందిళ్ల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పద్యనాటకానికి మంచి రోజులు రావాలని తన సోదరుడు శేఖర్‌బాబు కోరుకున్నారని, కానీ ఇప్పుడు ఆయన లేక పోవడం బాధకరమని అన్నారు.
    వేణుమాదవ్‌కు ఘనసత్కారం..
    పద్మశ్రీ డాక్టర్‌ నేరెళ్ల వేణుమాదవ్‌ను మేయర్‌ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దేవాదాయశాఖ డీసీ రమేష్‌బాబు సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్‌ మాట్లాడుతూ శేఖర్‌బాబు తనకు ఎంతో ఆత్మీయుడని అన్నారు. సాంస్కృతిక మండలి సభ్యులు మదన్‌మోహన్, బూర విద్యాసాగర్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ఆకుల సదానందం, తిరుమలయ్య, బిటవరం శ్రీధరస్వామి, దేవరాజు రవీందర్, మారేడోజు సదానందాచారి, వోడపల్లి చక్రపాణి, మారేడోజు బ్రహ్మం, కళా రాజేశ్వర్‌రావు, ఆలేటి శ్యామ్‌సుందర్, జడల శివ, వల్సపైడి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.  
    అలరించిన నాటక ప్రదర్శన..
    తడకమల్ల రామచంద్రరావు దర్శకత్వంలో ప్రదర్శించిన కృష్ణపక్షం పద్యనాటకం ఆహుతులను అలరించింది. పీసీపీ దాసు, ఆర్‌. ప్రసాద్, కె. శ్రీనివాస్, ఎస్‌కె. ముస్తాఫా, జి. వెంకటేశ్వర్లు, జి. మల్లయ్యచారి, జి. సైదులు, పి.వెంకటేశ్వర్లు, ఆర్‌. రమాలక్ష్మి (సురభి), కె. భద్రయ్యచారి, చిరంజీవి సిహెచ్‌. లక్ష్మణ్, మల్లయ్యచారి అద్భుతంగా నటించారు.  పానుగంటి చంద్రశేఖర్, కెఎస్‌ఎన్‌. శర్మ, ఎస్‌. రమేష్, ఎస్‌. జయప్రకాశ్‌ సంగీత సహకారం అందించారు. 

Advertisement
Advertisement