అప్‌గ్రేడ్‌ చేశారు.. భర్తీ మరిచారు! | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌ చేశారు.. భర్తీ మరిచారు!

Published Fri, Jul 28 2017 10:13 PM

అప్‌గ్రేడ్‌ చేశారు.. భర్తీ మరిచారు! - Sakshi

- పండిట్ల అప్‌గ్రేడేషన్‌ పోస్టులు భర్తీకాక సమస్య
- చాలా స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ఆందోళన
- మరోవైపు మిగులు టీచర్లుగా మారుతున్న పండిట్లు
- ఇదీ జిల్లాలో తెలుగు, హిందీ పండిట్ల దుస్థితి


అనంతపురం ఎడ్యుకేషన్‌: విడపనకల్లు మండలం పాల్తూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో 490 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రెండు ఎస్‌ఏ తెలుగు పోస్టులతో పాటు ఒక ఎల్‌పీటీ పోస్టు ఉంది. రెండు ఎస్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎల్‌పీటీగా పని చేస్తున్న టీచరు 8 ఏళ్లు సర్వీస్‌ పూర్తికావడంతో ఆయన కూడా బదిలీపై వెళ్లనున్నారు. అంటే ఈ స్కూల్‌లో తెలుగు చెప్పే టీచరు ఉండరు. ఇది ఈ ఒక్క పాఠశాల పరిస్థితే కాదు.. జిల్లాలో అనేక పాఠశాలల్లో ఇలాంటి సమస్యే ఉంది. తెలుగుతో పాటు హిందీ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ పరిస్థితి :
     పండిట్ల అప్‌గ్రేడేషన్‌ చేసినా పదోన్నతులు కల్పించని కారణంగా చాలా స్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ టీచర్లు లేరు. అర్హులైన టీచర్లు ఉన్నారు...కేవలం పదోన్నతులు కల్పిస్తే ఆ స్కూళ్లలో పోస్టులన్నీ భర్తీ అవుతాయి. కానీ ప్రభుత్వం నాన్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లోని తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ తదితర భాషా పండితులతో పాటు పీడీ పోస్టులను ఉన్నతీకరిస్తూ 2016 ఆగస్టు 2న ప్రభుత్వం 144 జీఓ విడుదల చేసింది. ఆ తర్వాత అప్‌గ్రేడ్‌ అయిన పోస్టులను భాషా పండితులోనే భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 14, 15 జీఓలను విడుదల చేసింది. పీఈటీ పోస్టులను పీడీ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేసి పదోన్నతులు కూడా కల్పించారు. కానీ భాషా పండితుల పోస్టులను భర్తీ చేయలేదు.

76 మంది పండిట్లు మిగిలిపోనున్నారు : ప్రస్తుత బదిలీల పూర్తయితే తెలుగు, హిందీ పండిట్లు 76 మందికి స్థానాలు లేక మిగిలిపోనున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన తెలుగు పండిట్లు 350 మంది ఉన్నారు. అలాగే రేషనలైజేషన్‌ ప్రభావంతో బయటకు వెళ్లనున్న టీచర్లు 53 మంది అంటే మొత్తం 403 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. అయితే ఖాళీలు మాత్రం 351 మాత్రమే ఉన్నాయి. తక్కిన 52 మంది ఎల్‌పీటీల పరిస్థితి చెప్పేవారులేరు.

అలాగే ఎల్‌పీహెచ్‌కు సంబంధించి 157 మంది 8 ఏళ్లు పూర్తయిన వారున్నారు. 69 మంది రేషనలైజేషన్‌ ప్రభావంతో బయటకు వెళ్లనున్నారు. మొత్తం 226 మంది బదిలీ కావాల్సి ఉండగా ఖాళీలు మాత్రం 202 మాత్రమే ఉన్నాయి. అంటే వీరిలోనూ 24 మంది గాలిలో ఉంటారు. మిగులు టీచర్లందరూ డీఈఓ ఫూలో ఉంటారు. అయితే వీరందరినీ ఎస్జీటీ ఎగెనెస్ట్‌ పోస్టులకు సర్దుబాటు చేసి జీతాలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.   

పదోన్నతులు కల్పించి ఉంటే..:
జిల్లాలో 84 ఎల్‌పీటీలు, 40 ఎల్‌పీహెచ్, 5 ఉర్దూ పోస్టులను ఉన్నతీకరించారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి ఉంటే...తెలుగుకు సంబంధించి 32 పోస్టులు, హిందీకి సంబంధించి 16 పోస్టులు మిగిలి ఉండేవి. అంటే వచ్చే డీఎస్సీకి కూడా పోస్టులుండేవి. కానీ పదోన్నతులు కల్పించకపోవ చాలా స్కూళ్లలో తెలుగు, హిందీ ఉపాధ్యాయులు లేకుండా పోతున్నారు.

ఇది చాలా అన్యాయం
భాషా పండితులకు ఎస్‌ఏలుగా పదోన్నతులు కల్పించడంలో చాలా అన్యాయం చేస్తున్నారు. బదిలీలు జరిగితే చాలా స్కూళ్లలో ఎస్‌ఏ తెలుగు, హిందీ టీచర్లుండరు. పదోన్నతులు కల్పించని కారణంగా 76 మంది పండిట్లు మిగులు టీచర్లుగా మారనున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అప్‌గ్రేడ్‌ అయిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీయాలి.
- ఆదిశేషయ్య, ఎస్‌ఎల్‌టీఏ, జిల్లా అధ్యక్షుడు

మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తాం
అప్‌గ్రేడ్‌ అయిన ఎస్‌ఏ పోస్టులకు భాషాపండితులకు పదోన్నతులు కల్పించే అంశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత బదిలీల్లో స్థానాలు లేని పండిట్లను ఎస్జీటీ అగైనెస్ట్‌ పోస్టుల్లో నియమిస్తాం. వారికి జీతాలకు ఇబ్బంది ఉండదు. అలాగే అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తాం.
- లక్ష్మీనారాయణ, డీఈఓ

Advertisement

తప్పక చదవండి

Advertisement