ఊరంతా కంటతడి | Sakshi
Sakshi News home page

ఊరంతా కంటతడి

Published Wed, Apr 26 2017 7:02 PM

ఊరంతా కంటతడి - Sakshi

కేతేపల్లి : ఊరు ఊరంతా శోకసంద్రమైంది. ఈత సరదా ఐదుగురు చిన్నారులను బలిగొనడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మండల కేంద్రానికి చెందిన పసల లూర్ధురాజు కుమార్తెలు పూజిత, సాత్విక, పసల రాజు కూతురు తేజ, కుమారుడు, శిరిల్, పసల ఆరోగ్యయ్య కుమారుడు పవన్‌లు మంగళవారం సరదాగా ఈతకొట్టేందుకు స్థానిక నిమ్మలమ్మ చెరువులో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. లూర్ధురాజు,ఆరోగ్యయ్యలు సొంత అన్నదమ్ములు. మంగళవారం రాత్రి పొద్దునపోయిన తర్వాత మృతదేహాలను చెరువు నుంచి బైటకు తీశారు.
 
ఐదుగురి చిన్నారుల మృతదేహాలకు బుధవారం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అనంతరం స్వగ్రామానికి తీసుక వచ్చారు. మృతదేహాలను కడసారిగా వీక్షించేందుకు బంధువులు, గ్రామస్తులు మృతుల నివాస స్థలాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఎంతో గారాబంగా చూసుకున్న తమ ఇంటి వెలుగులు ఆరిపోవటంతో ఆయా కుటంబాల్లో విషాదం నెలకొంది.
 
కన్నీటి వీడ్కోలు
చిన్నారుల మృతదేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామస్తులతో పాటు బంధువులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలోని కైస్తవ కాలనీ విషాదకరంగా మారింది. సాయంత్రం వేళ చిన్నారుల మృతదేహాలను స్థానిక చర్చిలో ఉంచి మతగురవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల మృతదేహాల అంతిమ యాత్రలో వందలాదిగా జనం పాల్గొన్నారు.
 
పలువురు నేతల పరామర్శ
చిన్నారుల మృతదేహాలను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు వేర్వేరుగా సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన రెండు కుటుంబాలకు ఒక్కో రూ.25వేల చొప్పున, ఒకరు మృతిచెందిన కుటుంబానికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.60వేలను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థికసాయం అందజేశారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక్కో మృతుడికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.50వేలను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. 
 
మృతుల కుటంబాలను పరామర్శించిన వారిలో కేతేపల్లి ఎంపీపీ గుత్త మంజుల, సింగిల్‌విండో చైర్మన్‌ బి.చినవెంకులు, కేతేపల్లి–2 ఎంపీటీసీ మట్టి సునీత, సింగిల్‌విండో డైరెక్టర్‌ కె.ప్రదీప్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పసల శౌరయ్య, బొజ్జ సుందర్, జటంగి వెంకటనర్సయ్యయాదవ్, మారం చెన్నక్రిష్ణారెడ్డి, కోట పుల్లయ్య, కోట మల్లికార్జనరావు, చిమట వెంకన్న, బోళ్ళ నర్సింహారెడ్డి, ఎన్‌.మంగమ్మ, ఎం.కర్ణాకర్‌రెడ్డి, ఎండీ.యూసుఫ్‌జానీ, కానుగు యాదగిరి, పి.ప్రభాకర్‌రెడ్డి, కె.మహేందర్‌రెడ్డి, మట్టి సాల్మన్, కె.వీరయ్య, ఎ.వెంకట్‌గౌడ్, సీహెచ్‌.మారయ్య తదితరులు ఉన్నారు.
 
ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
మండలకేంద్రం కేతేపల్లిలో ప్రమాదశవాత్తు ఐదుగురు చిన్నారుల చెరువులో మునిగి మృత్యువాత పడిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా చెరువులోకి చిన్నారులు ఎక్కడి నుండి దిగారు, చెరువులో ఎక్కడ మునిగారు, అక్కడ నీరు ఎంత లోతుగా ఉండి తదితర విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లో అడ్డగోలుగా మట్టి ఎత్తి తరలించేవారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement