చెయ్యి విరిగిందని వెళ్తే.. | Sakshi
Sakshi News home page

చెయ్యి విరిగిందని వెళ్తే..

Published Mon, Aug 1 2016 10:02 AM

చెయ్యి విరిగిందని వెళ్తే.. - Sakshi

నిలువునా ప్రాణం తీశారు!
వైద్యశాల వద్ద మృతుని బంధువుల ధర్నా 

కందుకూరు అర్బన్‌:  చెయ్యి విరిగిందని వైద్యశాలకు వెళ్తే.. వైద్యులు నిలువునా ప్రాణం తీశారని ఆరోపిస్తూ వైద్యశాల ఎదుట మృతుని బంధువులు ధర్నా చేశారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాల వద్ద ఆదివారం జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మాదాల గోవిందరావు (50) వారం క్రితం తన ఇంటి వద్ద మంచం నుంచి కింది పడి ఎడమ చెయ్యి విరిగింది. బంధువులు ఆయన్ను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యులు గోవిందరావు చేతికి గురువారం ఆపరేషన్‌ చేశారు. శుక్రవారం 11 గంటల సమయంలో గోవిందరావుకు మూత్రం రావడం లేదంటూ అంబులెన్స్‌లో ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా మారిందని, మరో వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు వైదశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదే రోజు రాత్రి గోవిందరావు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అంత్యక్రియల అనంతరం బంధువులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి ఆందోళనకు దిగారు. అపరేషన్‌ చేసిన చేతికి ఇనుపరాడ్డు అమర్చారని, అది ఇన్‌ఫెక్షన్‌ ఇవ్వడం వల్లే మృతి చెందాడని, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే తమకు నష్టం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ధర్నా చేశారు. వాడిన మందుల వివరాలు, ఆపరేషన్‌ వివరాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. సంబంధింత వైద్యుడు మాట్లాడుతూ గోవిందరావు మృతి విషయంలో తమ తప్పు ఏమీ లేదని చెప్పారు. అనుమానాలు ఉంటే విచారించుకోవచ్చని గోవిందరావు బంధువులతో చెప్పారు. 

Advertisement
Advertisement