శిఖం కబ్జా! | Sakshi
Sakshi News home page

శిఖం కబ్జా!

Published Mon, Sep 12 2016 6:08 PM

రాజిపేట పెద్దచెరువులో బోర్ల ద్వారా సాగుతున్న భూమి

  • పెద్దచెరువు శిఖంలో యథేచ్ఛగా బోర్ల తవ్వకం
  • 69 ఎకరాల్లో సగం శిఖం మాయం
  • సర్వే చేసి హద్దులు పాతాలంటున్న సర్పంచ్‌
  • కౌడిపల్లి: చెరువు శిఖం భూమిని కొందరు రైతులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. జిల్లాలో బోరుబావులు తవ్వకంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంగిస్తూ శిఖం భూమిలో బోర్లు వేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

    మండలంలోని రాజిపేట పెద్దచెరువు శిఖం సర్వే నంబర్‌ 231లో 69 ఎకరాలు ఉంది. వర్షాకాలంలో ఈ చెరువు పూర్తిగా నిండితే ఆయకట్టు పరిధిలోని సుమారు 150 ఎకరాలు సాగులోకి వస్తుంది. రాజిపేటకు పెద్దచెరవుకు పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో కొద్దిపాటి వర్షం పడినా నిండేది. గత నాలుగేళ్లుగా సరిగా వర్షాలు లేకపోవడంతో చెరువు నిండటం లేదు.

    దీంతో చెరువు శిఖం పైబాగంలో గల రాజిపేటతో పాటు పక్క గ్రామమైన ఖాజీపేట గ్రామస్తులు శిఖం భూమిని కబ్జా చేస్తున్నారు. దీంతో 69 ఎకరాల ఆయకట్టు సగానికి పైగా కబ్జాకు గురైంది. 20 నుంచి 25 మంది రైతులు ప్రతి ఏడాది కొద్దికొద్దిగా సగం శిఖం భూమిని ఆక్రమించారు. ఆక్రమించిన భూమిలో వరి సాగు చేసి బోరుబావులు వేస్తున్నారు. ఇటీవల ఖాజీపేట గ్రామానికి చెందిన రైతులు గత వారం బోరువేసి సాగు చేస్తున్నారు.

    గ్రామంలో నీటి సమస్య
    గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోరుబావి చెరువు శిఖం బోరు ఉంది. రైతులు ఆక్రమించిన పొలంలో గ్రామ పంచాయతీ బోరు ఉంది. పంచాయతీ బోరు పక్కనే రైతులు బోరు వేశారు. దీంతో పంచాయతీ బోరులో నీళ్లు తగ్గాయి. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిఖం భూమి సర్వేచేసి కబ్జాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.  

    హద్దులు చూపాలి
    పెద్ద చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. 69 ఎకరాలు శిఖం భూమి  సగం కంటే ఎక్కువ కబ్జాకు గురైంది. రైతులు ఆక్రమించిన భూమిలో యథేచ్ఛగా బోర్లు వేసి సాగు చేస్తున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరు పక్కన బోరు వేయడంతో గ్రామంలో  మంచినీటి సమస్య తలెత్తుతోంది. అధికారులు స్పందించి సర్వే చేసి హద్దులు చూపాలి. - మహ్మద్ పాషా, రాజిపేట సర్పంచ్‌

Advertisement
Advertisement