చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు

Published Sun, Sep 4 2016 9:01 PM

చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు - Sakshi

-వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ
సాక్షి, చిత్తూరు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నిప్పు కాదు తుప్పు’ అని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనునిత్యం నిప్పు అని తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు.. ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నిజంగా నిప్పు అయితే స్టేను నిలుపుదల చేయించుకుని దర్యాప్తు చేయించుకోవాలని కోరారు.


రెయిన్‌గన్‌లపై పబ్లిసిటీ స్టంట్
వేరుశనగ పంట ఎండిపోయిన తరువాత రేయిన్‌న్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంట ఎండు ముఖం పట్టే సమయంలోనే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రయత్నించి ఉండేవారని చెప్పారు. రెయిన్‌గన్లను తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. 20 సంత్సరాల క్రితమే రాయలసీమ రైతులు స్ప్రింక్లర్ల రూపంలో వీటిని వినియోగించేవారని పెద్దిరెడ్డి తెలిపారు. రెయిన్ గన్ల వల్ల పంటకు ఇప్పుడు ఒక్క శాతం కూడా అవసరం లేదన్నారు. నష్టపోయిన వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.12 వేలు లెక్కన చెల్లించాలని డిమాండ్ చేశారు.


హంద్రీ నీవా నీరు కుప్పానికి తొలిప్రాధాన్యం ఇస్తాననడం చిత్తూరు జిల్లా వ్యక్తిగా తాను హర్షిస్తున్నానని పెద్దిరెడ్డి అన్నారు. అయితే హంద్రీనీవా పిల్ల కాలువలకు కూడా నీరందిస్తే పేద రైతులకు కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. కృష్ణానీటిని చిత్తూరుజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని రైతుల పొలాలు తడిసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement