ఇక పింఛన్లకు ఐరిష్ | Sakshi
Sakshi News home page

ఇక పింఛన్లకు ఐరిష్

Published Sun, Nov 1 2015 10:25 PM

penction distribution through irish method

తిరుపతి కార్పొరేషన్: డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఐరిష్ విధానంతో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మెప్మా స్పెషల్ డెరైక్టర్ చిన్నతాతయ్య వెల్లడించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి ఐరిష్ విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ...రాష్ట్రంలో 44 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. గతంలో పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా ఇస్తుంటే ఆలస్యమయ్యేదని, అందుకే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. దీనికి ఆధార్ లింకు పెట్టడం వల్ల పంపిణీ సమయంలో పలు సాంకేతిక సమస్యలు వస్తున్నట్టు తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్ సామర్థ్యం పెంచడం, ఆధార్, బీఎస్‌ఎన్‌ఎల్ సర్వర్లను సరిచేసి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. అయితే ఈ సమస్యలు పునరావృతం కాకుండా లబ్ధిదారులకు ఐరిష్ తీస్తామని, దాని ద్వారా డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement