జన గర్జన | Sakshi
Sakshi News home page

జన గర్జన

Published Sun, Apr 24 2016 2:44 AM

జన గర్జన - Sakshi

చంద్రబాబు అరాచక రాజకీయాలపై మండిపాటు
ఏపీ వ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ ప్రదర్శనలు కొవ్వొత్తులతో విపక్ష శ్రేణుల ర్యాలీలు
 
♦ ఎమ్మెల్యేలను కొనే డబ్బు ఎక్కడిదంటూ నిలదీత
♦ టీడీపీ కుటిల రాజకీయంపై వెల్లువెత్తిన ఆగ్రహం
♦ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపాటు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతి, అరాచక రాజకీయాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో రణభేరీ మోగింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో  పార్టీ శ్రేణులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి ‘సేవ్ డెమోక్రసీ’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటిల రాజకీయాలపై  నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బెక్కడినుంచి వచ్చింది బాబూ అంటూ నిలదీశారు. స్పష్టమైన మెజార్టీ ఉండగా రూ. 20 కోట్లకు పైగా వెచ్చించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి బాబు అవినీతి సొమ్ముకు, ఎంగిలి మెతుకులకు ఆశపడి పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఒకప్పుడు ఆరోపించిన చంద్రబాబు.. ఇప్పుడు అదేపనిని నిస్సిగ్గుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. బాబు దమననీతిని ఎండగట్టారు. కాకినాడలో జరిగిన ర్యాలీలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. తునిలో తాను రాజీనామా చేస్తానని, ఏ మంత్రినైనా సరే తనపై పోటీ చేసి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని బొత్స సత్యనారాయణ విశాఖలో డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement