చలించరా..? | Sakshi
Sakshi News home page

చలించరా..?

Published Sat, Dec 17 2016 11:00 PM

చలించరా..? - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చలి తీవ్రత పెరిగి మామూలు జనమే ఇక్కట్లు పడుతుండగా..ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రాత్రి పూట చలితో వణికే పరిస్థితి ఉన్నా కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక రోగులు, వారి సహాయకులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్బజార్, ఎంఎన్జే క్యాన్సర్‌ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్ టీ, ఛాతి, సరిజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు చలికి విలవిల్లాడుతున్నారు.

అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో వారు బతికుండగానే నరకం చూస్తున్నారు. ఒక వైపు పడుకునేందుకు పడకల్లేక పోగా, ఉన్న పడకలపై చిరిగిన పరుపులు..మాసిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్సలో కనీస సదుపాయాలు లేక రోగికి సహాయంగా వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

రోగులకు ఇవ్వకుండా బీరువాలోనే...
ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.

గాంధీలో ఇటీవల రెండు రంగుల దుప్పట్లు అందజేసినప్పటికీ.. వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. ఇక నిలోఫర్‌ నవజాత శిశువుల ఆస్పత్రిలో పడుకునేందుకు మంచాలే కాదు, రాత్రి చలేస్తే కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేక శిశువులు గజగజ వణుకుతున్నారు. సుల్తాన్బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది.

టెండర్‌ దాటని కొనుగోళ్లు
ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఇన్ఫెక్షన్రేటును తగ్గించి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భావించింది. రోజుకో రంగు చొప్పున వారానికి ఏడు రంగుల దుప్పట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశంలోని 19 ప్రధాన ఆస్పత్రుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పైలెట్‌ ప్రాజెక్ట్‌గా గాంధీ జనరల్‌ ఆస్పత్రిని ఎంపిక చేసింది. నెల రోజుల క్రితం 303 పడకలకు రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది.

తొలుత రోజుకో కలర్‌ చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించి..చివరకు అది సాధ్యపడక పోవడంతో తెలుపు, గులాబీ, బ్లూ, స్కై బ్లూ రంగులకు కుదించింది. తెలుపు, గులాబి రంగు దుప్పట్లను సాధారణ పడకలపై, బ్లూ, స్కై బ్లూ దుప్పట్లను ఐసీయూ, డాక్టర్లు, నర్సులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 వేల పడకలు ఉండగా, వీటిలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎ¯ŒSజే క్యాన్సర్, సరోజినీదేవి వంటి బోధనాసుపత్రుల్లోనే 8,374 పడకలున్నాయి. మొత్తం లక్ష దుప్పట్లు అవసరం కాగా 40 వేలు తెలుపు, 40 వేలు గులాబీ, 10 వేలు స్కై బ్లూ, మరో 10 వేలు నీలి రంగు దుప్పట్లు కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం ఇప్పటికే ఆసక్తిగల కంపెనీల నుంచి టెండర్‌ ఆహ్వానించగా ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. అయితే కేటాయింపు అంశం ఇంకా ఫైనల్‌ కాలేదు.

Advertisement
Advertisement