వరుణుడు కరుణిస్తేనే! | Sakshi
Sakshi News home page

వరుణుడు కరుణిస్తేనే!

Published Mon, Jun 26 2017 1:19 AM

వరుణుడు కరుణిస్తేనే!

తిరుమలలో నీటి ఎద్దడి షురూ
ఎండిన మూడు డ్యాములు, రెండింటిలో తగ్గిన నిల్వలు
80 రోజులకే తాగునీరు
కళ్యాణితో కొంత ఊరట.. నీటి సేకరణ పెంచిన టీటీడీ
కొండపై పొదుపు చర్యలు చేపట్టిన అధికారులు


తిరుమలేశుని సన్నిధిలో తాగునీటి కష్టాలు తరుము కొస్తున్నాయి. ప్రస్తుతం కొండ మీద డ్యాముల్లోని తాగునీరు 80 రోజులకే సరిపోతుంది. కళ్యాణి నీరు కొంత ఊరటనిస్తున్నా వరుణుడు కరుణిస్తే తప్ప కొండమీద తాగునీటి కష్టాలు తొలిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో అధికారులు పొదుపు చర్యలు పెంచారు.

తిరుమల: తిరుమలలో తాగునీటి సమ స్య పొంచి ఉంది. గోగర్భం, ఆకాశగంగ, పసుపుధార డ్యాములు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి. 5,240 లక్షల గ్యాలన్ల సామర్థ్య మున్న పాపవినాశనం డ్యాములో ఆదివారానికి నీటి నిల్వలు 35 శాతానికి చేరాయి. 3224.83 లక్షల గ్యాలన్ల సామర్థ్యమున్న కుమారధారలో 25 శాతానికి చేరింది. ఫలితంగా తిరుమలలో నీటి నిల్వలు  80 రోజులకు మాత్రమే సరఫరా అవుతాయి. ఈ క్రమంలో టీటీడీ అధికా రులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. గతంలో తిరుపతి కల్యాణి డ్యాం నుంచి రోజువారీగా స్వీకరించే 4.5 ఎంఎల్‌డీ నీటిశాతాన్ని 8 ఎంఎల్‌డీకి పెంచారు. కల్యాణిలోని నీటితో పాటు అక్కడి బోర్ల నుంచి నీటిని తిరుమలకు లిఫ్ట్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి మరికొన్ని రోజులు అదనంగా వాడుకోవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

పెరిగిన నీటి పొదుపు చర్యలు..
తీవ్ర వర్షాభావంతో తిరుమలలో డ్యాములు ఎండిపోతుండటంతో టీటీడీ అధికారులు నీటి పొదుపు చర్యలు వేగవంతం చేశారు. నీటి సరఫరా, వాడకంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్నిచోట్లా నిర్ధిష్ట విధానాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే కాటేజీల నీటి సరఫరాలో కోటా విధానం అమలు చేస్తున్నారు. వెలుపల ఉండే నీటి కొళాయిల సంఖ్యను తగ్గించారు. పొదు పు చర్యలు పెరగటంతో భక్తులు నీటి కష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఇక స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్, ఇతర ప్రాంతాల్లోనూ ఆరు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు.

వరుణుడు కరుణిస్తాడని..
ఈసారి నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వచ్చాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే 5రోజుల పాటు వరుణయాగం కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణుడి కరుణ కోసం టీటీడీ ఎదురుచూస్తోంది. వర్షాలు విస్తారంగా కురిస్తేనే తిరుమల జలాశయాల్లో నీటి కళవచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement