నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి

Published Sat, Sep 3 2016 11:09 PM

Person slipped in water pond

ఎర్రగుంట్ల:  ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె గ్రామ పరిధిలో ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో ఉన్న నీటి గుంత వద్దకు కాళ్లకు అయిన మట్టిని కడుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరబాటున జారి గుంతలో పడి మృతి చెందాడు. మృతుడు భార్య భువనేశ్వరి, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు ...  ముద్దనూరు మండలం నల్లబల్లె గ్రామానికి చెందిన గుగ్గల సుదర్శనరెడ్డి(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య భువనేశ్వరి ఉన్నారు. ఇంటికి ప్లాస్టిక్‌ కుర్చీలు తెచ్చుకునేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నల్లబల్లె గ్రామం నుంచి ప్రొద్దుటూరుకి సున్నపురాళ్లపల్లె మీదుగా బయలుదేరాడు. సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద బురద నీరు ఉంది. ఆ బురద నీటిలో నుంచి అలాగే వెళ్లడంతో సుదర్శనరెడ్డి కాళ్లకు బురద అయింది. ఈ బురదను కడుక్కోవడానికి సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశాత్తు గుంతలోకి జారి పడ్డాడు. గుంత సుమారు పది అడుగుల లోతు ఉండడంతో ఈత రాక సుదర్శన్‌రెడ్డి మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దారిన వెళుతున్న ప్రయాణికులు గుంతలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కలమల్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకి గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి భార్య భువనేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కలమల్ల హెడ్‌ కానిస్టేబుల్‌ గురుశేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement