లీకేజీల జోరు.. | Sakshi
Sakshi News home page

లీకేజీల జోరు..

Published Thu, Sep 22 2016 8:54 PM

లీకేజీల జోరు..

  • తాగునీరు డ్రెయినేజీ పాలు
  • మరమ్మతులకు లక్షలు వృథా
  • అయినా ఆగని పైపులైన్‌ పగుళ్లు
  •  రోజు 2 ఎంఎల్‌డీలు వృథా
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌ : నగరంలో ఓ వైపు తాగునీటి కరువు ఉంటే..మరో వైపు ఎక్కడపడితే అక్కడ పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రతీ రోజు దాదాపు 2 ఎంఎల్‌డీల నీరు లీకేజీలతో వృథా అవుతుందని అంచనా. ఇంత నీరు డ్రెయినేజీ పాలవుతున్న కార్పొరేషన్‌ అధికారులు మాత్రం స్పందించడం లేదు. లీకులను అడ్డుకునే చర్యలు తీసుకోవడం లేదు. 
     
    నగరానికి ప్రతి రోజు 30 ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. హైలెవల్, లోవెల్‌ విభాగాల్లో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. వీధికొక లీకేజీతో నీటి ప్రెషర్‌ తగ్గి చివరన ఉన్న నల్లాలకు సరిగ్గా సరఫరా కావడం లేదు. భగత్‌నగర్‌ ట్యాంకులోకి నీటిని నింపకుండానే బైపాస్‌ ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీకులతో నీరు కూడా కలుషితమవుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. 
     
    డ్రెయినేజీలో కలుస్తున్న తాగునీరు
    పైపులైన్‌ లీకేజీలు అరికట్టేందుకు ప్రతి నెల రూ.లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. అయినా సత్ఫలితాలివ్వడం లేదు. నగరానికి సరఫరా అయ్యే 30 ఎంఎల్‌డీల్లో 2 ఎంఎల్‌డీల నీరు వృథాగానే పోతుందని సిబ్బంది అంచనా. ఈ వృథా నీటితో కనీసం ఒక డివిజన్‌కు నీటి సరఫరా చేయవచ్చు. నీటి సరఫరా సమయంలో సామర్థ్యం కంటే వాల్వ్‌లు ఎక్కువగా తిప్పడంతో ఉధృతి పెరిగి పైపులైన్‌లు పగులుతున్నాయని తెలుస్తోంది. మరమ్మతులు విఫలమవడానికి అధికారులు ఈ సూత్రాన్నే పాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    ఇక్కడే లీకేజీలు..
    • నగరంలోని హైలెవల్, లోలెవల్‌ సంప్‌లకు నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్‌ నుంచి అంబేద్కర్‌ స్టేడియం వరకు ఉన్న ప్రధాన పైపులైన్‌కు ప్రతిరోజు ఎక్కడో ఒక లీకేజీ ఏర్పడుతూనే ఉంది. 
    • భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, సప్తగిరికాలనీ, రాంనగర్, బ్యాంక్‌కాలనీ, సుభాష్‌నగర్, అశోక్‌నగర్, కాపువాడ, కోతిరాంపూర్, శర్మనగర్, కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్‌ ప్రాంతాల్లో లెక్కకు మించి లీకులు కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రతిరోజు ఆయా డివిజన్లలో తవ్వకాలు చేపడుతున్నారు.  
    పాతపైపులైన్‌లు కావడంతోనే
    ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపులు కావడంతో ప్రెషర్‌ తట్టుకోవడం లేదు. పాత పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరమ్మతులు వస్తున్నాయని, వీటి స్థానంలో కొత్త పైపులైన్లు వేయాలనే డిమాండ్‌ ఉంది. హడావిడిగా మరమ్మతులు చేపడుతుండడంతో లీకేజీలు మళ్లీ ఏర్పడుతున్నాయని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement