పోడు చేస్తే పాడే.. | Sakshi
Sakshi News home page

పోడు చేస్తే పాడే..

Published Wed, Aug 17 2016 11:11 PM

పోడు చేస్తే పాడే.. - Sakshi

  • పోడు భూముల్లో పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ
  • భారీగా భూములు స్వాధీనం
  • మెుక్కలు నాటేందుకు ఏర్పాట్లు
  • మంత్రి చెప్పినా వినని అధికారులు
  • లబోదిబోమంటున్న పోడు రైతులు
  • కొత్తగూడ : కొత్తగూడ ఏజెన్సీలో భారీ ఎత్తున పోడు భూములను స్వాధీనం చేసుకుని మెుక్కలు నాటేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ మాసానికి ముందే వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని పంటలు వేయకుండా అడ్డుకుని మెుక్కలు నాటారు. ఇప్పుడు పంటలు వేసిన భూముల్లో సైతం డోజర్‌ ట్రాక్టర్లతో పంటలు ధ్వంసం చేసి ప్లాంటేషన్‌ చేసేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈశ్వరగూడెం గ్రామ సమీపంలో అటవీ భూముల్లో వేసిన పంటలను తొలగించారు.
     
    అడవికి మారు పేరు ఏజెన్సీ ప్రాంతం.. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ప్రధాన జీవనాధారం పోడు వ్యవసాయం. అయితే ప్రతీ సంవత్సరం పోడు పెరుగుతుండటం, అడవి తరుగుతుండటంతో ప్రభుత్వాదేశానుసారమే పోడు భూముల స్వాధీనం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు వారించినా.. వివిధ పార్టీలు, పోడుదారులు ఆందోళనలు చేసినా ప్లాంటేషన్‌ పనులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ వారు ఇంటర్‌నెట్‌ ఆధారంగా 2014 వరకు అడవి ఉండి ఆ తరువాత సాగులోకి వచ్చిన భూముల వివరాలు గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ అందించే నెంబర్ల ఆధారంగా పోడు భూములను గుర్తిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలాంటి సమాచారమూ బయటకు తెలియకుండా ఒక్కసారిగా యంత్రాలతో దాడులు చేసి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
     
    పది ఎకరాలకు మించి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారిని గుర్తించి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. పోడు భూముల ఆక్రమణలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు తేలితే భూముల స్వాధీనంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు మండలానికి చెందిన వార్డెన్‌ ఈసం స్వామి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును గత సంవత్సరం సస్పెండ్‌ చేశారు. మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీ నాయకుడు జంగాల విశ్వనాథంకు చెందిన 24 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని నర్సరీ పెట్టారు.
     
    ఆ భూమిని ఆదివాసీలకు ఇవ్వాలని హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోకుండా కోర్టులో కూడా శాఖాపరంగా కేసుకు వెళ్తూ భూమిని మాత్రం వదలకపోవడం విశేషం. అదే విదంగా గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు కాసీంను ఆ పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగూడ మండలానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధిపై కూడా ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది.  భారీగా పోడు చేసిన బావురుగొండ గ్రామానికి చెందిన పలువురు నుంచి అటవీ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకున్నారు. 
     
    ప్లాంటేషన్‌ ఇలా..
    కొత్తగూడ మండలంలో నర్సంపేట రేంజ్‌ పరిధి కొత్తపల్లి బీట్‌లో 13 హెక్టార్లు, కర్నెగండిలో 5 హెక్టార్లు, ముస్మి–1 బీట్‌లో 10హెక్టార్లు, ముస్మి–2 బీట్‌లో 5 హెక్టార్లు, ఎంచగూడెం నార్త్, సౌత్‌ బీట్లల్లో 5 హెక్టార్ల చొప్పున ప్లాంటేషన్‌ చేశారు. కొత్తగూడ రేంజ్‌ పరిధిలో మర్రిగూడెం బీట్‌లో 50 హెక్టార్లు, కొత్తగూడ బీట్‌లో 28 హెక్టార్లు, తిరుమళగండి బీట్‌లో 10 హెక్టార్లు, పందెం బీట్‌లో 3 హెక్టార్లు, బత్తులపల్లి బీట్‌లో 5 హెక్టార్లలో ప్లాంటేషన్‌ చేశారు. అదే బీట్‌లో మరో 5హెక్టార్లు, పోలారం బీట్‌లో 20 హెక్టార్లు ప్లాంటేషన్‌ చేసేందుకు చదును చేసి గుంతలు తవ్వారు. వర్షాలు లేక పనులు ఆపారు.
     
    మంత్రి చెప్పినా..
     ఇప్పటి వరకు ఎన్నడూలేని విధంగా పోడు భూములపై అటవీ శాఖ కన్నెర్ర చేయడంతో స్థానిక అధికార పార్టీ నాయకులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫారెస్ట్‌ శాఖ దాడులు ఆపేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రయత్నాలు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. ఆదివాసీ నిరుపేద రైతులు 2005 కంటే ముందు సాగు చేసిన భూములలో సాగుకు అడ్డు తగలబోమని ఆ తరువాత సాగు చేసిన పోడు భూములను, పది ఎకరాలకంటే ఎక్కువ సాగుచేస్తున్న రైతులను మాత్రం వదలబోమని ఫారెస్ట్‌ ఉన్నతాధికారులు కరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఆదివాసీ కుల సంఘాలు, ప్రతిపక్షాలు, విప్లవ పార్టీలు రైతుల పక్షాన ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోగా ప్లాంటేషన్‌ పనులను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండటంతో ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది.   

Advertisement
Advertisement