ప్లేట్‌లెట్స్‌ తగ్గినా... వెంటనే రికవరీ | Sakshi
Sakshi News home page

ప్లేట్‌లెట్స్‌ తగ్గినా... వెంటనే రికవరీ

Published Mon, Aug 21 2017 3:03 AM

ప్లేట్‌లెట్స్‌ తగ్గినా... వెంటనే రికవరీ - Sakshi

జ్వరం వస్తే .. మలేరియానా, టైఫాయిడా,  డెంగీనా అని నిర్ధారించే పరీక్షల కన్నా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ను తెలుసుకునేందుకే ప్రస్తుతం ఎక్కువగా ప్రాధానత్య ఇస్తున్నారు. అయితే, జ్వరం కారణంగానే ప్లేట్‌లెట్స్‌ తగ్గవని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గినా ఒక్కరోజులోనే రికవరీ అవుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

మనిషి శరీరంలోని రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్‌ ఉంటాయి. బోన్‌ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కణాల్లో ఎర్ర రక్తకణాలు 120 రోజులు జీవించి ఉంటాయి. తెల్లరక్తకణాలు నెల రోజులు, ప్లేట్‌లెట్స్‌ 8 నుంచి 12 రోజులు పాటు జీవించి ఉంటాయి. ఏదైనా వ్యాధి కారణంగా కానీ, వైరస్‌ కారణంగా గానీ ఎముకలోని మూలిగపై ప్రభావం చూపినప్పుడు ఆయా కణాల ఉత్పత్తి తగ్గుతుంది.

ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయంటే...
∙శరీరంలోని రక్తంలో ఒక క్యుబిక్‌ మిల్లీ లీటరుకు లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. ఇవి రోజుకు 60 వేల వరకు ఉత్పత్తి అవుతుంటాయి.
♦ డెంగీ జ్వరం వచ్చిన వారిలో వైరస్‌ కారణంగా, రక్తంలో కాంప్లిమెంట్‌ అనే పదార్థం యాక్టివేట్‌ అవడం వల్ల ప్లేట్‌లెట్స్‌ ఉత్పత్తి తగ్గుతుంది.
♦ యాంటీ ప్లేట్‌లెట్స్, యాంటీ బాడీస్‌ వృద్ధి చెందడం వల్ల ఉత్పత్తి అయిన ప్లేట్‌లెట్లు క్షీణించిపోతాయి. దీంతో ఉత్పత్తి తగ్గడం, ఉన్న ప్లేట్‌లెట్స్‌ క్షీణించడంతో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి.
♦ కొన్ని రకాల యాంటిబయోటిక్స్‌ వినియోగం వల్ల కూడా బోన్‌మ్యారోపై ప్రభావం చూపి ప్లేట్‌లెట్స్‌ ఉత్పత్తి తగ్గుతుంది.
ప్లేట్‌లెట్స్‌ తగ్గడం వల్ల దుష్పరిణామాలు
♦ రక్తంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గడం వల్ల విపరీతమైన వెన్నునొప్పి, తలనొప్పి, చర్మం లోపల దద్దుర్లు, కాలేయం, ప్లీహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
♦ రక్తంలో అతి చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఈ దశలో ఒక్కసారిగా ప్లాస్మా బయట ఉన్న కనెక్టివిటీస్‌లోకి లీక్‌ అవుతుంది. ఆ తర్వాత ప్రతి కణానికి రక్తం అందుబాటులో ఉండదు. అందువల్ల మనుషులు మరణిస్తారు.

డెంగీ వచ్చిన అందరిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గవు
డెంగీ వచ్చిన అందరిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గే అవకాశాలు లేవు. 95 శాతం మందిలో సాధారణంగానే డెంగీ తగ్గిపోతుంది. ఎవరిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయనేది చెప్పలేం. కొందరిలో జ్వరం వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. మరికొందరిలో వారం రోజులకు తగ్గుతాయి. కొందరిలో ఒకటి, రెండు రోజులు తగ్గి, మళ్లీ అవే రికవరీ అయిపోతాయి. అందువల్ల ఎవరికీ ప్రమాదంగా మారుతుందో చెప్పలేము. ప్లేట్‌లెట్స్‌ తగ్గకుండా ఉండేందుకు మందులు లేవు. తగ్గినప్పుడు కృత్రిమంగా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించుకోవడమే పరిష్కారం.
– డాక్టర్‌ ఎన్‌.భరత్‌రావు, పెథాలజీ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల  

Advertisement
Advertisement