కాగితాల్లోనే ప్లాట్లు | Sakshi
Sakshi News home page

కాగితాల్లోనే ప్లాట్లు

Published Mon, Jun 20 2016 1:49 AM

కాగితాల్లోనే ప్లాట్లు - Sakshi

- రాజధానికి భూములిచ్చిన రైతులకు సర్కారు దగా
- లాటరీ ద్వారా కాగితాలపైనే ప్లాట్ల కేటాయింపు
భౌతికంగా కేటాయింపు ఇప్పట్లో లేనట్లే
నేడు తుళ్లూరు మండలం నేలపాడులో ప్రారంభం  
అనుకూలంగా ఉన్న గ్రామాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం
చదును, మార్కింగ్,  లేఔట్లకు చాలా సమయం పట్టే అవకాశం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో వారిని దగా చేస్తోంది. భూమిపై ఇవ్వాల్సిన ప్లాట్లను కాగితాలు, మ్యాపుల్లో చూపించి మభ్యపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లోనే మొదట ఈ తంతు సాగించేందుకు సీఆర్‌డీఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు సోమవారం నుంచి ప్లాట్లు ఇస్తామని మంత్రులు, అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగితాలపై కేటాయించే ప్లాట్లను భౌతికంగా రైతులకు ఎప్పుడు ఇస్తారో మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు. తమ ప్లాటును ఇప్పట్లో కళ్లతో చూసుకునే అదృష్టం లేదని తెలియడంతో రాజధాని రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పదికి పైగా గ్రామాల్లో అభ్యంతరాలు
 భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను తొలుత లాటరీ ద్వారా కేటాయిస్తారు. ఏ రైతుకు ఎక్కడ ప్లాటు వస్తుందో సెల్‌ఫోన్‌లో మెసేజ్ పంపిస్తారు. ఒకే సైజు ప్లాట్లివ్వాల్సిన రైతులను గ్రూపుగా చేసి లాటరీ ద్వారా ఈ కేటాయింపులు చేయనున్నారు. లాటరీలో వచ్చిన ప్లాటు వివరాలతో సంబంధిత రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇస్తారు. మూడు వారాల్లో లేఔట్ చూపిస్తామంటున్నా ప్లాటును రైతులకు ఎప్పుడు అప్పగిస్తారనే విషయం అధికారులకే తెలియడం లేదు. రాజధాని భూ సమీకరణకు నేలపాడు గ్రామ రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేయకపోవడంతో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం దాన్ని ఎంచుకుని ఇలా కాగితాల్లో ప్లాట్ల పంపిణీని ప్రారంభించనుంది. కొద్ది రోజుల్లో తుళ్లూరు మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కాగితాలపై ప్లాట్ల కేటాయింపునకు సీఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూ సమీకరణకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పదికిపైగా గ్రామాల్లో కాగితాల్లో ప్లాట్ల కేటాయింపు ఇప్పట్లో అసాధ్యమని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే భూములిచ్చిన 29 గ్రామాల్లోని 22 వేల మంది రైతులను మీకెలాంటి ప్లాట్లు కావాలో ఆప్షన్లు ఇవ్వాలని అడిగితే కేవలం ఎనిమిది వేల మంది మాత్రమే స్పందించారు. మిగిలిన వారు ఆప్షన్ల జోలికే పోలేదు.
 
 33 వేల ఎకరాలను చదును చేసేదెన్నడు?
 రాజధాని భూ సమీకరణకు భూములిచ్చిన జరీబు రైతులకు ఎకరానికి వెయ్యి గజాల నివాస ప్లాటు, 450 గజాల వాణిజ్య ప్లాటు, మెట్ట రైతులకు వెయ్యి గజాల నివాస ప్లాటు, 200 గజాల వాణిజ్య ప్లాటు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇస్తామని కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. ఈ ప్లాట్ల పంపిణీని పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సోమవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నేలపాడులో 1,100 ఎకరాల్లో దాదాపు 700 మంది రైతులకు లాటరీ విధానం ద్వారా ప్లాట్లు ఎక్కడ వస్తాయో తేలుస్తారు. ఆ తర్వాత ఈ ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి లేఔట్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

లేఔట్లు వేసిన తర్వాత కాగితాల్లో చూపిన మేరకు రైతులకు భూమిపై ప్లాటు చూపించి యాజమాన్య పత్రాలు ఇస్తారు. ఇదంతా జరగడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. లేఔట్లు వేసిన తర్వాత పాత సర్వే నంబర్లను రద్దు చేసి మాస్టర్‌ప్లాన్‌లో చూపించిన ప్రాంతాల్లో కొత్త సర్వే నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్వే నెంబర్లు ఇచ్చేందుకు జీపీఎస్ సర్వే పూర్తి చేయాలి. ఇక లేఔట్లు వేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇంకెంత సమయం పడుతుందో చెప్పలేం.

ఈ పనులన్నీ పూర్తికావాలంటే ముందు సమీకరించిన భూములను చదును చేయాలి. 33 వేల ఎకరాల్లో ఇప్పటివరకూ ఐదారు వేల ఎకరాలను కూడా చదును చేయలేదు. చదును పనులు పూర్తయిన తర్వాతే మార్కింగ్, లేఔట్లు, కొత్త సర్వే నంబర్ల కేటాయింపు జరుగుతుంది. నేలపాడు రైతులకు కాగితాలపై ప్లాట్లు కేటాయించినా అవి చేతికి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మిగిలిన గ్రామాల వారికి ఇలా కాగితాలపైనా వెంటనే ప్లాట్లిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగితాలపైన ప్లాట్లు ఇవ్వడానికే ఇంత ఆలస్యం జరుగుతుంటే ఇక రైతులు అక్కడ ఇళ్లు నిర్మించుకునేది ఎప్పుడో అంతుబట్టడం లేదు.

Advertisement
Advertisement