విషాహారం ప్రాణాలు తీసింది | Sakshi
Sakshi News home page

విషాహారం ప్రాణాలు తీసింది

Published Mon, Feb 27 2017 1:08 AM

విషాహారం ప్రాణాలు తీసింది - Sakshi

జీలుగుమిల్లి (పోలవరం) : కూలి పనులు, చేపల వేటను జీవనాధారం చేసుకుని బతుకుతున్న గిరిజన కుటుంబంలో తాబేలు మాంసం తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్దతో పాటు ఆ ఇంటి ఇల్లాలిని అనంతలోకాలకు తీసుకుపోయి బిడ్డలను అనాథలుగా మిగిల్చింది. నిల్వ ఉన్న తాబేలు మాంసం వండుకుని తినడంతో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైన విషాద ఘటన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల గిరిజనులు శుక్రవారం అం తర్వేదిగూడెం గ్రామంలోని చెరువులో చేపల వేటకు వెళ్లారు. చేపలతో పాటు 14 తాబేళ్లు కూడా వలల్లో చిక్కాయి. తాబేలు మాంసాన్ని పది వాటాలుగా చేసుకుని పంచుకున్నారు. సోయం సత్యనారాయ ణ కుటుంబం తప్ప మిగిలిన వారంతా అదేరోజు వండుకుని తిన్నారు. అయితే సత్యనారాయణ కుటుంబం మాత్రం వా రి వాటా మాంసాన్ని ఉడకబెట్టి ఆగిలేసి నిల్వ ఉంచారు. శనివారం మధ్యాహ్నం నిల్వ చేసిన మాంసాన్ని తిన్నారు. మర లా సాయంత్రం స్థానికంగా దొరికే కల్లు తాగి తాబేలు మాంసంతో భోజనం చేశా రు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల తర్వాత సోయం సత్యనారాయణ (45)కు వాంతులు, విరేచనాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందాడు. సత్యనారాయణను తీసుకువెళ్లిన గంటలోనే అతని భార్య సోయం దుర్గమ్మ (40)కు వాంతులు, విరేచనాలు మొదలయ్యా యి. ఆమెను ఆటోలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వీరి కుమారుడు మధు, అతని స్నేహితుడు మయిబోయిన అర్జున్‌ కూడా ఇదే మాంసాన్ని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా రెండో పూట మాంసం తినని మృతుల బిడ్డలు మమత, మంగరాజు క్షేమంగా ఉన్నారు. ఇద్దరి మృతికి కారణంగా భావిస్తున్న తాబేలు మాంసాన్ని ఆదివారం వైద్యశాఖ అధికారి రంజిత్‌కుమార్‌ పరీక్షించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బాలసురేష్‌ చెప్పారు. ఈ దుర్ఘటనతో అంకన్నగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement