లాఠీ..చార్జ్‌ | Sakshi
Sakshi News home page

లాఠీ..చార్జ్‌

Published Mon, Aug 29 2016 11:43 PM

లాఠీ..చార్జ్‌ - Sakshi

  • పంపాదిపేటవాసులపై విరుచుకుపడిన పోలీసులు
  • ‘దివీస్‌’ పనులను అడ్డుకున్నవారి అరెస్టుకు యత్నం
  • దొరికినవారిని దొరికినట్టు చితకబాదిన వైనం
  • ప్రతిఘటించిన బాధిత ప్రజలు  
  • పలువురికి తీవ్ర గాయాలు
  •  
     
    సామాన్యులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు పాలకుల ఒత్తిడితో కర్కశత్వాన్ని ప్రదర్శించారు. తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివీస్‌ ల్యాబొరేటరీస్‌ రసాయన పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన పంపాదిపేట వాసులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని ప్రతిఘటించిన గ్రామస్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. ఈ లాఠీచార్జిలో సుమారు పదిమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత ప్రజలకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు.
     
    తుని/తొండంగి : 
    ప్రజల మనోగతానికి భిన్నంగా ప్రభుత్వం మొండి పట్టుదలతో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు చేస్తున్న యత్నాలు.. తొండంగి మండలం కోన ప్రాంతంలో ఆరని చిచ్చు రగిలిస్తున్నాయి. పంపాదిపేట సమీపాన దివీస్‌ లేబ్స్‌ చేపట్టిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆ గ్రామంతో పాటు తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామస్తులు ఆదివారం ప్రతిఘటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు మరో 23 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పంపాదిపేటలో ఉద్యమిస్తున్న వారిలో ప్రధానమైనవారిని లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేసేందుకు పోలీసులు సోమవారం ప్రయత్నించడం మరోమారు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. తొలుత తుని పట్టణ సీఐ అప్పారావు, రూరల్‌ సీఐ చెన్న కేశవరావు, తొండంగి, కోటనందూరు, తుని రూరల్‌ ఎస్సైలతోపాటు అధిక సంఖ్యలో పోలీసులు హఠాత్తుగా పంపాదిపేట చేరుకున్నారు. గ్రామంలో దొరికినవారిని దొరికినట్టు లాక్కొచ్చి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు. దీనిని ప్రతిఘటించినవారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. మహిళలని కూడా చూడకుండా చితకబాదడంతో పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో నేమాల లోవరాజు, మట్ల రామకృష్ణ, కుమ్మరి లక్ష్మి, తలపంటి మణితల్లి, మరికొందరిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనికి ససేమిరా అన్న గ్రాస్తులు జీపులో ఎక్కించినవారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పంపాదిపేట ప్రజలతో చర్చించారు. సమస్యను పక్కతోవ పట్టించేం దుకు పోలీసుల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని, సంయమనం పాటించాలని చెప్పారు. తమకు వివాదం పోలీసులతో కాదని, పరిశ్రమ యాజమాన్యానికి, పేద రైతులకు మధ్య వచ్చిన భూముల తగాదాను శాంతిభద్రతల సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శాంతించారు. దివీస్‌ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి పనులు జరిగినా ప్రతిఘటిస్తామని, పరిశ్రమ తరలిపోయేవరకూ ఊరుకునేది లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించడం అన్యాయమని బాధితులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. గాయపడినవారిని ఎమ్మెల్యే తన వాహనంలో తుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.
    ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు
    అమాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని పెద్దాపురం డీఎస్పీ రాజేశ్వరరావుకు ఎమ్మెల్యే రాజా సూచించారు. అక్రమ అరెస్టులకు పాల్పడితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అది ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ తొండంగి మండల నాయకులు పేకేటి సూరిబాబు, మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ రాజు,  యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ శివకోటి ప్రకాష్‌ తదితరులున్నారు.
    దళితులపై దాడులను సహించేది లేదు
    దివీస్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలపై పోలీసులు దాడి చేయడం అన్యాయమని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బీఎన్‌ రాజు అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తే జిల్లావ్యాప్తంగా దళితులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
     
    లాఠీలతో కొట్టి లాక్కెళ్లారు
    పోలీసులు ఒక్కసారిగా గ్రామంలోకి వచ్చి దొరికినవారిని దొరికినట్టు లాక్కెళ్లారు. నా వీపుపై తీవ్ర గాయాలయ్యేలా కొట్టారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం అన్యాయం. మమ్మల్ని ఏం చేసినా సరే పరిశ్రమను పెట్టనిచ్చేదిలేదు.
    – మచ్చర్ల మాణిక్యం, పంపాదిపేట
    దారుణం
    గ్రామంలో ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదు. అంతమంది పోలీసులు వచ్చి గ్రామస్తులను లాక్కెళ్లారు. నన్ను కొట్టి లాక్కెళ్తుండగా మెడలో బంగారు వస్తువులు కూడా పోయాయి. ఏం నేరం చేశామని మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు?
    – మచ్చర్ల వెంకటలక్ష్మి, పంపాదిపేట
     
     

Advertisement
Advertisement