ఉరుకులు.. పరుగులు..! | Sakshi
Sakshi News home page

ఉరుకులు.. పరుగులు..!

Published Mon, Dec 7 2015 9:05 AM

ఉరుకులు.. పరుగులు..! - Sakshi

  •      చింటూ విచారణతో ఖాకీల అలెర్ట్
  •      నీవానదిలో రెండు రివాల్వర్లు, కత్తులు స్వాధీనం
  •      పోలీసుల అదుపులో బెంగళూరు వ్యక్తి
  •  
    చిత్తూరు (అర్బన్):  మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు కస్టడీలో చింటూ  పలు విషయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అతనిచ్చే సమాచారంతో పోలీసులు పరుగులు పెడుతున్నారు.

    మేయర్ హత్య తర్వాత చింటూ కార్పొరేషన్ కార్యాలయంపై నుంచి కిందకు వచ్చేప్పుడు తన చేతిలో ఉన్న రివాల్వర్ చూపిస్తూ అందరినీ పక్కకు వెళ్లమని హెచ్చరించి గోడదూకి జీడీనెల్లూరు వైపు పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. గోడ దూకే సమయంలో ఎయిర్ పిస్టల్ కింద పడిపోయింది. మేయర్‌పై హత్యకు ఉపయోగించిన రివాల్వర్ దొరక్కపోవడంతో అది నిందితుడి వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    ప్రస్తుతం కస్టడీలో ఉన్న చింటూను విచారించిన పోలీసులు రివాల్వర్లు, కత్తులను జీడీనెల్లూరు వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి నీవానదిలో పడేసినట్లు తెలుసుకున్నారు. ఎక్కడ వేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి చింటూను బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుడు చూపించిన ప్రాంతంలో అయస్కాంతం సాయంతో రెండు రివాల్వర్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ రివాల్వర్లు నాటువిగా పోలీసులు చెబుతున్నారు. మేయర్‌పై జరిపిన కాల్పుల్లో కింద పడ్డ బుల్లెట్ కవచం విదేశాలకు చెందినది కావడంతో హత్యకు ఉపయోగించిన రివాల్వర్ కోసం నీవానది వద్ద పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

    కస్టడీ నుంచి జైలుకు
    ఈ కేసులో తొలుత అరెస్టు చేసిన వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్‌ను కోర్టు అనుమతితో పోలీసులు పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆ గడువు శనివారంతో పూర్తయ్యింది. ఈ క్రమంలో వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.
     
    నలుగురిపై కేసు నమోదు

    చిత్తూరు మేయర్ హత్య కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాఘటనలో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నలుగురిపై కేసు నమోదు చేశారు. నింది తుల అరెస్టును సోమవారం చూపనున్నారు.
     
    అదుపులో మరో వ్యక్తి...
    ప్రధాన నిందితుడు చింటూకు బెంగళూరులో ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ చేసేందుకు శనివారం ఓ పోలీసు బృందం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ చింటూకు కారును ఇచ్చారని నిర్ధారించుకుని అతన్ని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ఈ క్రమంలో నగరంలోని ఓ ప్రదేశంలో ఉంచి రహస్యంగా విచారిస్తున్నారు.
     
    నిందితులకు రిమాండు
    మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చింటూకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై పుంగనూరుకు చెందిన లోకేష్, రఘుపతి, న్యాయవాది కీలపట్ల ఆనంద్‌కుమార్, కర్ణాటకకు చెందిన నాగరాజును శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని ఆదివారం ఉదయం స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ యుగంధర్ ముందు హాజరుపరచారు. వారికి ఈ నెల 18 వరకు రిమాండు విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement