హతవిధీ.. ఏమిది! | Sakshi
Sakshi News home page

హతవిధీ.. ఏమిది!

Published Sat, Oct 22 2016 10:40 PM

police over action

► అధికారానికి అండగా ఖాకీలు
► వివాదాస్పదం అవుతున్న పోలీసు వైఖరి
► తుందుర్రు, తాడేపల్లిగూడెం ప్రాంతం ఏదైనా సెక్షన్‌ 307 కేసులే
► చట్టపరంగా నిలవకపోయినా వేధింపులే లక్ష్యం
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారానికి ఖాకీ చొక్కా తోడైతే.. పరిస్థితి ఎలా ఉంటుందో సామాన్యుడి నుంచి ప్రతిపక్ష నేతల వరకూ  అందరికీ అర్థమవుతోంది. ప్రశాంతతకు మారపేరైన ‘పశ్చిమ’లో అధికార పక్షం పోలీస్‌ రాజ్యం నడుపుతోంది. ఇదేమని ప్రశ్నించినా.. ఎదురు తిరిగినా.. ఖాకీలను అడ్డం పెట్టుకుని బెదిరించడం, అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిపోయింది. అధికారపక్ష ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల సమక్షంలోనే పోలీసులపై విరుచుకుపడినా.. అసభ్య పదజాలంతో బూతుపురాణం విప్పి దూషిస్తున్నా కనీసం నోరు మెదపలేని దుస్థితికి ఖాకీ వ్యవస్థ చేరడం చర్చనీయాంశంగా మారింది. తుందుర్రులో అధికార పక్షం అండతో ప్రై వేటు వ్యక్తులు నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకించిన వారిపై పోలీసుల దమనకాండ ఏ విధంగా సాగిందో అందరికీ విదితమే. తాజాగా ఫ్లెక్సీలు కట్టే విషయంలో తలెత్తిన వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు వారిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సాగిస్తున్న హైడ్రామా జిల్లాలో పోలీసు వ్యవస్థను నవ్వుల పాలు చేస్తోంది. తుందుర్రులో అక్వా పార్క్‌ను వ్యతిరేకించిన వారిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసులు నమోదు చేయడం, ఒక మహిళతో సహా ఏడుగురిని జైలుపాలు చేయడం తెలిసిందే. వారికి కనీసం బెయిల్‌ కూడా రాకుండా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుమారు 120 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయడంతోపాటు ఆ గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి ప్రజల్ని వేధించడం తెలిసిందే.
 
‘గూడెం’లో మంత్రి ఒత్తిడితో ..
తాడేపల్లిగూడెంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అధికారానికి దాసోహమైనట్టుగా ఉండటం వివాదాస్పదం అవుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగత ద్వారం ఏర్పాటుచేసే విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జనం మధ్యన కొవ్వూరు డీఎస్పీ సమక్షంలో సీఐని అసభ్య పదజాలంతో దూషించడం, ముఖ్యమంత్రితో చెప్పి సస్పెండ్‌ చేయిస్తానని బెదిరించడం చర్చనీయాంశమైంది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా పోలీసులు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. కొట్టు సత్యనారాయణ, మరికొందరిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, గాయపర్చడం వంటి ఆరోపణలు చేర్చి సెక్షన్లు 307, 341, 324 కింద కేసులు నమోదు చేశారు. మంత్రి మాణిక్యాలరావు, కొట్టు సత్యనారాయణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే మంత్రి మాణిక్యాల రావు వత్తిడి మేరకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాని 307 సెక్షన్‌ను మాజీ ఎమ్మెల్యేపై పెట్టారు. మంత్రి వర్గీయులపై మాత్రం స్టేషన్‌లోనే బెయిల్‌ ఇచ్చే సెక్షన్‌ 324 కింద వచ్చే అభియోగాలు మాత్రమే నమోదు చేశారు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో 307 సెక్షన్‌ను 324గా మార్చి బెయిల్‌ ఇచ్చారు. ఈ సెక్షన్‌ కింద బెయిల్‌ ఇచ్చే అవకాశం ఉన్నా కోర్టుకు తీసుకువెళ్లి రిమాండ్‌ విధింపచేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. 
 
పద్ధతి మారకపోతే ఉద్యమిస్తాం : ఆళ్ల నాని
అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలపైన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైన సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసే వైఖరి మానుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను శనివారం అరెస్ట్‌ చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నిస్తే 307 సెక్షన్‌ కింద కేసులు పెట్టడం జిల్లా పోలీసులకు ఆనవాయితీగా మారుతోందన్నారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, ఇదే పద్ధతి కొనసాగిస్తే తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒక మాజీ ఎమ్మెల్యే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదని నాని విమర్శించారు.  
 

Advertisement
Advertisement